Telangana Budget 2022-23: ఫామ్‌లోకి ఆ యిల్‌పామ్‌

8 Mar, 2022 03:49 IST|Sakshi

2.5 లక్షల ఎకరాలు .. రూ.1,000 కోట్లు

బడ్జెట్‌ 22–23

రైతుబంధుకు రూ.14,800 కోట్లు 

రుణమాఫీకి రూ.2,939.20 కోట్లు

రైతుబీమాకు రూ.1,488 కోట్లు

ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం

రైతులను వరి సాగునుంచి మళ్లించడమే లక్ష్యం!

ఉద్యాన శాఖకు కూడా భారీగా రూ.994 కోట్ల కేటాయింపులు

మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్ల బడ్జెట్‌

సాక్షి, హైదరాబాద్‌: మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే గతేడాది కంటే వ్యవసాయానికి నిధులు స్వల్పంగా తగ్గించింది. గత ఏడాది రూ.25 వేల కోట్లు కేటాయించగా ఈసారి అందులో రూ.746 కోట్లు తగ్గించి బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసింది. రైతుబంధు పథకానికి రూ.14,800 కోట్లు కేటాయించింది. ఎన్ని ఆర్థిక కష్టాలు ఎదురైనా రైతుకు, సాగుకు అండగా నిలిచే రైతుబంధు పథకానికి ప్రభుత్వం అవసరమైన కేటాయింపులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు రైతుబంధు కింద ఎనిమిది విడతల్లో రూ.50,448 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.

తద్వారా 63 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఇక రైతుబీమా ప్రీమియం కోసం గతేడాది రూ.1,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.1,488 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అదనపు కేటాయింపులు చేసింది. రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే ఈ పథకం కింద అతని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఇప్పటివరకు వివిధ కారణాలతో మరణించిన సుమారు 75 వేల మంది రైతుల కుటుంబాలకు రూ. 3,775 కోట్ల సాయం అందజేసింది. 

ఉద్యానశాఖకు గణనీయంగా పెరిగిన బడ్జెట్‌ 
ఉద్యానశాఖకు కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీగా రూ.994.85 కోట్లు కేటాయించింది. గతేడాదితో (రూ.242.30 కోట్లు) పోల్చితే రూ.752.55 కోట్లు అధికంగా కేటాయించడం గమనార్హం. రైతులను వరి నుంచి మళ్లించి ఇతర పంటల సాగుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం    ఉద్యానశాఖకు కూడా అధిక కేటాయింపులు చేసింది. మరోవైపు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.75 కోట్లు, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.17.50 కోట్లు కేటాయించింది.

వచ్చే ఏడాది రూ.75 వేల లోపు రుణాల మాఫీ
ఈ ఏడాది బడ్జెట్‌లో రైతు రుణమాఫీకి రూ.2,939.20 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 35.32 లక్షల మంది రైతులకు చెందిన రూ.16,144 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ దఫా రుణమాఫీలో భాగంగా ఇప్పటివరకు 5.12 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో రూ.50 వేలలోపు రుణాలు ఈ మార్చిలోపు మాఫీ అవుతాయి.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని బడ్జెట్లో స్పష్టంగా ప్రకటించారు. ఇలావుండగా ఈసారి వ్యవసాయ యంత్రీకరణకు నిధులను గణనీయంగా తగ్గించారు. 2021–22 బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయిస్తే, ఈసారి కేవలం రూ.377.35 కోట్లకే పరిమితం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు కలిస్తే ఇది దాదాపు రూ.500 కోట్లు మాత్రమే ఉండే అవకాశముందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 

రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా ఉండటం, అనుకూల వాతావరణం నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రెండున్నర లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని భావిస్తోంది. అందుకోసం బడ్జెట్లో ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించింది.  

మరిన్ని వార్తలు