దళిత, గిరిజనులకు భారీ ‘నిధి’ 

7 Feb, 2023 03:15 IST|Sakshi

కేటాయింపులు రూ.51,983.09 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌) చట్టానికి తాజా బడ్జెట్లో ప్రభుత్వం భారీ కేటాయింపులు చేసింది. 2023–24 బడ్జెట్‌లో దళిత, గిరిజనులకు ఏకంగా రూ. 51,983.09 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 36,750.48 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ. 15,232.61 కోట్ల చొప్పున నిధుల కేటాయింపులు చేసింది.

గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి ఎస్‌డీఎఫ్‌ కేటాయింపులు రూ. 4,632.72 కోట్లు పెరిగాయి. ఇందులో ఎస్సీఎస్‌డీఎఫ్‌ కేటగిరీలో రూ. 2,182.73 కోట్లు పెరగగా... ఎస్టీఎస్‌డీఎఫ్‌ కేటగిరీలో రూ. 1,819.99 కోట్లు పెరిగాయి. దళిత, గిరిజనులకు భారీ స్థాయిలో నిధులివ్వడంతో ఆయా వర్గాల సమగ్ర అభివృద్ధి ముందుకు సాగనుంది.

దళితబంధుకు 17,700 కోట్లు..
తాజా బడ్జెట్‌లో దళితబంధు వాటా అగ్రభాగాన నిలిచింది. 2023–24 బడ్జెట్లో దళితబంధు పథకానికి ప్రభుత్వం రూ. 17,700 కోట్లు కేటాయించింది. హుజూరాబాద్‌ మినహా మిగతా 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2023–24 వార్షిక సంవత్సరంలో ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేయనుంది.

మరిన్ని వార్తలు