రుణమాఫీపై నీలినీడలు!

7 Feb, 2023 04:14 IST|Sakshi

వ్యవ‘సాయం’ రూ. 26,831 కోట్లు 

రూ.17,991 కోట్లకుగాను కేటాయించింది రూ. 6,380 కోట్లే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతు రుణమాఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామన్న సర్కారు ఇందుకు రూ. 19,198 కోట్లు లెక్కగట్టగా ఇప్పటివరకు రూ. 37 వేలలోపు రుణాలున్న రైతులకు రూ. 1,207 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ. 17,991 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ఈ ఏడాదితో ముగుస్తుంది. కానీ రుణమాఫీకి ప్రభుత్వం 2023–24 బడ్జెట్లో రూ. 6,380 కోట్లే కేటాయించింది. అంటే అవసరమైన సొమ్ములో దాదాపు మూడో వంతు కేటాయించారు. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 5.66 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయగా మరో 31 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత కేటాయింపుతో ఎంతమంది రైతులు లబ్ధిపొందుతారన్నది స్పష్టం కావాల్సి ఉంది.

పంటనష్ట పరిహారానికి ఈ‘సారీ’... 
రాష్ట్రంలో కొత్తగా పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించినా ఈ బడ్జెట్లో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. వాస్తవంగా నెల కిందట దీనికి సంబంధించి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో కొత్తగా బెంగాల్‌ తరహా పంటల బీమా పథకాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది.

కానీ చివరకు బడ్జెట్లో రైతులకు నిరాశ కలిగించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన నుంచి 2020లో వైదొలిగాక రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడంలేదు. దీంతో పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది.

మూడు పథకాలకే సింహభాగం కేటాయింపులు..
2022–23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లో రూ. 26,831 కోట్లు కేటాయించింది. అంటే గత బడ్జెట్‌కన్నా సుమారు రూ. 2,500 కోట్ల మేర కేటాయింపులు పెంచింది. అయితే ఈసారి మొత్తం కేటాయింపుల్లో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలకే సింహభాగం కేటాయించింది. రైతుబంధుకు 2022–23లో రూ. 14,800 కోట్లు కేటాయిస్తే 2023–24 బడ్జెట్లో రూ. 15,075 కోట్లు కేటాయించింది.

రైతు బీమాకు 2022–23లో రూ. 1,466 కోట్లు కేటాయింపులు చేయగా ఈసారి బడ్జెట్లో రూ. 1,589 కోట్ల మేర కేటాయింపులు చేసింది. రైతు రుణమాఫీకి 2022–23 బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయించి విడుదల చేయని ప్రభుత్వం ఈసారి రూ. 6,380 కోట్లు కేటాయించింది. ఈసారి మొత్తం వ్యవసాయ బడ్జెట్‌లో ఈ మూడు పథకాలకే రూ. 23,049 కోట్లు కేటాయించింది. వ్యవసాయ విస్తరణ, అభివృద్ధికి కేటాయించింది తక్కువేనన్న విమర్శలున్నాయి.

ప్రగతి పద్దులో వ్యవసాయ కేటాయింపులు
►వ్యవసాయ యాంత్రీకరణకు ప్రగతి పద్దులో రూ. 377.35 కోట్లు కేటాయించారు. 
►రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ. 39.25 కోట్లు
►ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ. 75 కోట్లు
►కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 17.50 కోట్లు
►రైతుబంధు సమితికి రూ. 3 కోట్లు
►రైతువేదికలకు రూ. 12 కోట్లు
►మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌కు రూ. 75.47 కోట్లు
►వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు రూ. 1.99 కోట్లు
►విత్తనాభివృద్ధి సంస్థకు సాయం రూ. 25 కోట్లు
►మైక్రో ఇరిగేషన్‌కు కేవలం రూ. 1.25 కోట్లు
►ఉద్యాన కార్యకలాపాలకు ప్రోత్సాహం రూ. 7.50 కోట్లు
►ప్రభుత్వ ఉద్యానవనాల అభివృద్ధికి రూ. 3.50 కోట్లు

రుణమాఫీ కోసం 31 లక్షల మంది ఎదురుచూపు
►ఊసేలేని పంటల బీమా పథకం.. రైతులకు తప్పని నిరాశ
►అత్యధికంగా రైతుబంధుకు రూ.15,075 కోట్లు కేటాయింపు

ఆయిల్‌పామ్‌ సాగుకు రూ. వెయ్యి కోట్లు...
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రత్యేక దృష్టిపెట్టింది. నీటివనరులు పుష్కలంగా ఉండటంతో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది.

ఇది ప్రజల బడ్జెట్‌
వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు కేటాయించడంపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల బడ్జెట్‌ అని, తమది రైతు ప్రభుత్వమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ సాగునీటి రంగానికి రూ. 26,885 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1,91,612 కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. సీఎంకేసీఆర్‌ రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికి ఆదర్శమన్నారు.    
– వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి

కేటాయింపే..ఖర్చేది?
వ్యవసాయరంగ మొత్తం కేటాయింపుల్లో రైతుబంధుకు, రైతుబీమా పథకాలకు తప్ప మిగిలిన వాటికి కేటాయించిన నిధులను ఎక్కువగా ఖర్చు చేయడం లేదని రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి, విస్సా కిరణ్‌కుమార్‌ ఆరోపించారు. రైతు బంధుకు భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులలో కనీసం 40 శాతం నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు.

ముఖ్యంగా ఈ నిధులు వ్యవసాయం చేయని రైతులకు, వ్యవసాయం చేయని భూములకు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర సాగుదారుల్లో 35 శాతంగా ఉన్న కౌలు రైతులకుగానీ, పోడు రైతులకుగానీ, భూమిపై హక్కులులేని మహిళా రైతులకుగానీ ఒక్క రూపాయి కూడా రైతుబంధు సాయం అందడం లేదన్నారు. 
– రైతు స్వరాజ్య వేదిక 

మరిన్ని వార్తలు