బడ్జెట్‌లో ‘నిరుద్యోగ భృతి’

5 Feb, 2021 08:52 IST|Sakshi

తొలిసారిగా ప్రతిపాదించనున్నరాష్ట్ర ప్రభుత్వం 

రూ.5,000–7,000 కోట్ల కేటాయింపునకు అవకాశం 

రాష్ట్రంలో 30 లక్షలమందికిపైగా నిరుద్యోగులు 

త్వరలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్న సీఎం 

విధివిధానాలు వచ్చాక అర్హులపై రానున్న స్పష్టత 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కష్టకాలంలో నిరుద్యోగులకు ఓ శుభవార్త. రాష్ట్ర బడ్జెట్‌లో వారికి సంబంధించిన ఓ కొత్త అంశం చేరబోతోంది. అదే.. నిరుద్యోగభృతి. ప్రభుత్వం నిరుద్యోగభృతి చెల్లింపునకు సిద్ధమవుతోంది. వచ్చే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో నిరుద్యోగభృతికి నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిసారిగా నిరుద్యోగభృతి పద్దు కింద రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశాలున్నాయని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని 2018లో జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచి్చన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవడంతో రెండేళ్లుగా ఈ హామీ మరుగునపడిపోయింది.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగభృతి చెల్లించనుందని, త్వరలో దీనిపై సీఎం కేసీఆర్‌ ఓ ప్రకటన చేస్తారని ఇటీవల రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటన చేయడంతో ఈ హామీ మళ్లీ తెరపైకి వచ్చింది. నిరుద్యోగ భృతిపై లక్షలమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. వీరిలో ఎంతమంది నిరుద్యోగభృతికి అర్హులు? ఎవరు కాదు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం రూపొందించనున్న విధివిధానాల్లో జవాబు లభిస్తుంది. విధివిధానాల రూపకల్పన, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తదితర అంశాలపై త్వరలో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటన చేసే అవకాశముంది. ఆ తర్వాతే ఈ పథకం అమలుపై మరింత స్పష్టత రానుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.  

లక్షల్లో నిరుద్యోగులు 
రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది అన్న అంశంపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం లేదు. అయితే, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ తదితర స్థాయిల్లో చదువులు చదివినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక దాదాపు 30 లక్షలమందికిపైనే నిరుద్యోగులున్నట్టు ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో 25 లక్షల మంది నిరుద్యోగులు వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోని నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉండనున్నారు. ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లిస్తే ఒక అభ్యరి్థకి ఏడాదికి రూ.36,192 వ్యయం కానుంది. ఈ లెక్కన ఏడాది కాలంలో 10 లక్షల మంది నిరుద్యోగభృతికి రూ.3,619.20 కోట్లు, 20 లక్షల మందికి చెల్లించడానికి రూ.7,238.4 కోట్ల నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంటుంది. తొలి ఏడాది గరిష్టంగా 20 లక్షల మంది లోపు నిరుద్యోగులకు భృతి చెల్లించే అవకాశాలున్నాయి. ఇందుకోసం బడ్జెట్‌లో ప్రభుత్వం గరిష్టంగా రూ.7 వేల కోట్ల వరకు కేటాయించవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు