మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది: బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ తమిళిసై ప్రసంగం

3 Feb, 2023 12:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:   తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, తద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ బడ్జెట్‌-2023 సమావేశాల ప్రారంభం సందర్భంగా.. పబ్లిక్‌ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె తన ప్రసంగం చదివి వినిపించారు. 

‘పుట్టుక నీది.. చావు నీది.. బ‌తుకంతా దేశానిది..’ అంటూ కాళోజీ కవితతో ఆమె తన ప్రసంగం ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై, తెలంగాణ సర్కార్‌ను  మా ప్రభుత్వంగా ఆమె సంబోధించడం ఆకట్టుకుంది.  తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోంది. మా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించింది. ఆ కృషి వల్లే 24 గంటలు కరెంట్‌ ఉంటోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తలసరి విద్యుత్‌వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. గతంలో నీటి కోసం కొట్లాటలు జరిగాయి. ఇప్పుడు 24 గంటలపాటు నీటిని అందిస్తున్నాం. మిషన్‌ కాకతీయతో చెరువులను పునరుద్ధరించాం. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి మంచి నీరు అందిస్తున్నాం. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం.

దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు. రాష్ట్రం ఏర్పడగానే ఎస్టీ రిజర్వేషన్‌ 10 శాతానికి పెంచాం తండాలను పంచాయితీలుగా మార్చాం. పేదల కోసం ఆసరా పెన్షన్లతో ఆదుకుంటున్నాం. నేతన్న  బీమా పథకం ద్వారా జీవిత బీమా అందిస్తున్నాం. గీత కార్మికుల సంక్షేమం కోసం వైన్‌షాపుల్లో 15 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నాం.   తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు చేశాం. లాండ్రీ, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ అందిస్తున్నాం. సివిల్‌ పోలీస్‌ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నాం. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం రూ. 1,00,116లు ఆర్థిక సాయం అందిస్తున్నాం.  12.46 లక్షల ఆడపిల్లల కుటుంబాలకు షాదీ ముబారక్‌తో లబ్ధి చేకూరింది. 

వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం. రైతు సంక్షేమానికి మా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది.  రైతు బీమా అందిస్తున్నాం.  రైతు పండించే ప్రతీ బియ్యపు గింజను కొంటున్నాం.  దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారుతోంది. ఫ్లోరైడ్‌ సమస్య లేకుండా చేశాం. వివిధ శాఖల్లో ఏకకాలంలో 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. 2014 నుంచి కిందటి ఏడాది వరకు 1,41,735 ఉద్యోగాలను భర్తీ చేశాం. నాణ్యమైన విద్యను పిల్లలకు అందించేందుకే మన ఊరు మన బడి. మూడు దశల్లో ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో.. 28వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన. హైదరాబాద్‌ నలువైపులా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు. నిమ్స్‌లో అదనంగా మరో 2 వేల పడకలు. సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే ముందుంది.  పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షిస్తోంది.తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం మూడింతలు అయ్యింది అని ఆమె ప్రసంగించారు. 

>
మరిన్ని వార్తలు