తెలంగాణ బడ్జెట్‌: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

19 Mar, 2021 08:02 IST|Sakshi

సుంకిశాల పథకానికి రూ.725 కోట్లు  

కేశవాపూర్, వాటర్‌ గ్రిడ్, సీవరేజి మాస్టర్‌ ప్లాన్‌కు రూ.668 కోట్లు 

రుణ వాయిదాల చెల్లింపునకు రూ.738 కోట్లు.. 

ఉచిత నీటి పథకానికి రూ.250 కోట్లు.. 

గత ఏడాది దక్కింది రూ.1250 కోట్లే 

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గ్రేటర్‌ సిటీజన్లకు కొంత మోదం.. కొంత ఖేదం కలిగించింది. తాగునీటి పథకాలకు నిధుల వరద పారించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కృష్ణా మూడుదశల ప్రాజెక్టుల నీటిని గ్రేటర్‌కు తరలించేందుకు ఉద్దేశించిన సుంకిశాల జాక్‌వెల్‌ పథకం, కేశవాపూర్‌ భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ నిర్మాణం, ఔటర్‌ చుట్టూ వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు, సీవరేజ్‌ మాస్టర్‌ప్లాన్‌ అమలుకు భారీగా నిధులు దక్కడం విశేషం. మూసీ సుందర స్వప్నాన్ని సాకారం చేసేందుకు భారీగా నిధులు దక్కాయి. అదే క్రమంలో సిటీలో తీరైన రహదారుల విస్తరణ పథకాలతోపాటు ఏటా వర్షాకాలంలో నగరాన్ని ముంచెత్తుతున్న వరద నీరు సాఫీగా ప్రవహించేందుకు అవసరమైన నాలాల విస్తరణ పథకాలకు నిధులు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. బల్దియాకు సర్కారు వరుసగా మూడోసారి శూన్యహస్తమే చూపించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నగరంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుపేదల ఆశలపై ఈ బడ్జెట్‌ నీళ్లు చల్లిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పథకాలకు కేవలం రూ.10 లక్షల నిధులే దక్కడం నిరాశపరిచింది. ఈ సంస్థకు  జైకా రుణ వాయిదాల చెల్లింపునకు రూ.472 కోట్లు మాత్రమే దక్కాయి. హెచ్‌ఎండీఏ ప్రతిపాదించిన బాలానగర్‌ ఫ్లైఓవర్, పలు చోట్ల ప్రతిపాదించిన ఆకాశ మార్గాలకు నిధులు దక్కలేదు. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు నిధులు దక్కకపోవడం గమనార్హం. గ్రేటర్‌లో ప్రజా రవాణా రంగాన్ని పరిపుష్టం చేసేందుకు సంతృప్తికర స్థాయిలో నిధులు కేటాయించారు.

గ్రేటర్‌ ఆర్టీసీ పరిధిలో 25 డబుల్‌ డెక్కర్‌ బస్సులు.. మరో 50 ఎలక్ట్రిక్‌ బస్సులు త్వరలో సిటీ రహదారులపై దూసుకెళ్లనున్నాయి. ఎంఎంటీఎస్‌ రెండో దశకు యథావిధిగా ప్రభుత్వం శూన్యహస్తమే చూపింది. అత్యంత కీలకమైన ప్రజారోగ్య విభాగానికి, సర్కారు దవాఖానాల అభివృద్ధికి నిధులు దక్కకపోవడం పేదలను ఆశ్చర్యపర్చింది. ప్రధానంగా ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం, నిమ్స్‌ నెఫ్రాలజీ విభాగం, నిలోఫర్, చెస్ట్‌ ఆస్పత్రుల్లో నూతన భవనాల నిర్మాణం, ఇతర వైద్య సదుపాయాలు, మౌలికవసతుల కల్పనకు నిధుల కేటాయింపులు దక్కకపోవడం గమనార్హం.   

జలమండలికి రూ.2,381 కోట్ల కేటాయింపులు  
రాష్ట్ర బడ్జెట్‌లో జలమండలికి నిధుల ధార పారింది. కీలక పథకాలకు భారీగా కేటాయింపులు దక్కాయి. ప్రధానంగా కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా గ్రేటర్‌కు తాగునీటిని తరలించేందుకు అవసరమైన అత్యంత లోతైన జాక్‌వెల్స్‌ ఏర్పాటుకు ఉద్దేశించిన సుంకిశాల పథకానికి రూ.725 కోట్ల మేర కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్టుకు రూ.1450 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి జలమండలి  ఇటీవల నివేదించిన విషయం విదితమే. శామీర్‌పేట్‌ సమీపంలోని కేశవాపూర్‌ వద్ద 5 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న భారీ స్టోరేజీ రిజర్వాయర్‌ నిర్మాణంతో పాటు, నగరంలో మురుగునీటి శుద్ధికి పది ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం, ఔటర్‌ చుట్టూ సుమారు 158 కి.మీ మార్గంలో ఏర్పాటు చేయనున్న జలహారం (వాటర్‌గ్రిడ్‌) పనులకు మరో రూ.668 కోట్లు కేటాయించారు.

గతంలో కృష్ణా రెండు, మూడో దశల ప్రాజెక్టులతో పాటు గోదావరి మంచినీటి పథకానికి సంబంధించి వివిధ ఆర్థిక సంస్థల నుంచి జలమండలి తీసుకున్న రుణ వాయిదాల చెల్లింపునకు రూ.738 కోట్లు కేటాయించారు. నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటిసరఫరా పథకం అమలుకు రూ.250 కోట్లు కేటాయించడం విశేషం. గత ఏడాది జలమండలికి కేవలం రూ.1250 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో సింహభాగం బోర్డు రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపులకే కనాకష్టంగా సరిపోవడం గమనార్హం. తాజా బడ్జెట్‌లో జలమండలి కీలక పథకాలకు భారీగా నిధులు దక్కడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

‘సుంకిశాల’ ఎందుకంటే.. 
⇔ నగరానికి కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా నిత్యం 270 మిలియన్‌ గ్యాలన్ల నీటి తరలింపునకు ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు సమీపంలో భారీ నీటిపారుదల శాఖ నిర్వహిస్తున్న పుట్టంగండి పంప్‌హౌజ్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు.  
⇔ వేసవిలో నాగార్జున సాగర్‌లో నీటి మట్టాలు 510 అడుగుల దిగువనకు చేరినపుడు అత్యవసర పంపింగ్‌ ద్వారా కోదండాపూర్‌ నీటిశుద్ధి కేంద్రానికి కృష్ణా జలాలను తరలించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు లేకపోవడంతో ప్రతీ వేసవిలో సాగర్‌ బ్యాక్‌వాటర్‌ వద్ద డ్రెడ్జింగ్‌ పక్రియను చేపట్టడం, భారీ మోటార్లు ఏర్పాటు చేసి పంపింగ్‌ చేయాల్సి వస్తోంది.  
⇔ ఈ నేపథ్యంలో కృష్ణా మూడు దశల నీటిని అత్యంత లోతు నుంచి కూడా సులువుగా తోడేందుకు భారీ జాక్‌వెల్స్‌ నిర్మాణం చేసుకోవాలని ఇరిగేషన్‌ శాఖ జలమండలికి సూచించింది. దీంతో ముంబైకి చెందిన టాటా కన్సల్టెన్సీ బృందాన్ని జలమండలి రంగంలోకి దించింది. ఈ బృందం సుంకిశాల పథకం పూర్తి చేసేందుకు రూ.1450 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది.  

తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం 
ఈ పథకానికి రూ.725 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో అండర్‌ గ్రౌండ్‌ షాప్ట్, ఇన్‌టేక్‌ టన్నెల్, పంప్‌ హౌజ్‌ సూపర్‌ స్ట్రక్చర్, ఎలక్ట్రో మెకానికల్‌ ఎక్విప్‌మెంట్, సుంకిశాల నుంచి కోదండాపూర్‌ నీటి శుద్ధి కేంద్రం వరకు భారీ పైప్‌లైన్‌ ఏర్పాటుకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్, ఈడీ సత్యనారాయణలు తెలిపారు. సుంకిశాల పథకంతో వేసవిలో నగరానికి కృష్ణా జలాల తరలింపు మరింత సులువు కానుందని, అత్యవసర పంపింగ్‌ కష్టాలు తీరనున్నాయని వారు స్పష్టం చేశారు.  

>
మరిన్ని వార్తలు