ఎయిర్‌పోర్ట్‌ మెట్రోకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

9 Dec, 2022 03:37 IST|Sakshi

రాయదుర్గం మైండ్‌స్పేస్‌ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌ 

పోలీస్‌ అకాడమీ వద్ద బహిరంగ సభ 

మొత్తం 31 కిలోమీటర్ల దూరం.. మార్గంలో 8 నుంచి 9 స్టేషన్లు 

27.5 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్‌ మార్గం 

ఒక కిలోమీటర్‌ మేర రోడ్డుకు సమాంతరంగా నిర్మాణం 

ఎయిర్‌పోర్ట్‌ దగ్గర 2.5 కిలోమీటర్లు అండర్‌ గ్రౌండ్‌లో.. 

ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా అండర్‌గ్రౌండ్‌ మెట్రోస్టేషన్‌తో అనుసంధానం 

రెండో దశ ప్రత్యేకతలను వివరించిన హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు శుక్రవారం శంకుస్థాపన జరుగుతోంది. రాయదుర్గం మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు ఈ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రాయదుర్గం మైండ్‌స్పేస్‌ వద్ద శుక్రవారం ఉదయం 10.05 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు.

తర్వాత 10.20 గంటలకు తెలంగాణ పోలీస్‌ అకాడమీ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సుమారు రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ప్రతీ అంశం విశేషమేనని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. గురువారం రసూల్‌పురాలోని మెట్రోరైల్‌ భవన్‌లో ఆయన ఈ వివరాలు తెలిపారు. 

మూడు విధాలుగా మార్గం 
రాయదుర్గం మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఎక్స్‌ప్రెస్‌ మెట్రోను నిర్మించనున్నారు. ఇందులో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్‌ కారిడార్‌(ప్రస్తుత మెట్రో తరహాలో)కాగా.. విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మిస్తారు. మిగతా కిలోమీటరు మేర రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. మొత్తంగా 8 నుంచి 9 స్టేషన్లను ప్రతిపాదించామని.. విమానాశ్రయంలో రెండు మెట్రోస్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 

మూడో లెవల్‌లో.. 
రాయదుర్గం వద్ద ప్రారంభమయ్యే ఎయిర్‌పోర్ట్‌ మెట్రో బయో డైవర్సిటీ జంక్షన్‌ వద్ద రెండు ఫ్లైఓవర్లపైన మూడో లెవల్‌లో నిర్మించనున్నారు. ఖాజాగూడ రోడ్డులో కుడివైపుగా నానక్‌రాంగూడ జంక్షన్‌ మీదుగా ఓఆర్‌ఆర్‌ ప్రవేశ ప్రాంతానికి మెట్రో చేరుతుంది. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు వరకు ఓఆర్‌ఆర్‌కు, సర్వీస్‌రోడ్డుకు మధ్యలో కొనసాగుతుంది. 

రెండోదశ కింద మరిన్ని మార్గాల్లో.. 
మెట్రో రెండో దశలో భాగంగా బీహెచ్‌ఈఎల్‌–లక్డీకాపూల్‌ కారిడార్‌ (31కి.మీ.), నాగోల్‌–ఎల్బీనగర్‌ (5కి.మీ.), బీహెచ్‌ఈఎల్‌–లక్టీకాపూల్‌ (26కి.మీ.) మార్గాల డీపీఆర్‌లను కేంద్రానికి పంపించామని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. తొలిదశ మెట్రో మార్గాల్లో 31.50 కోట్ల మంది ప్రయాణం చేశారన్నారు. దీనితో 9.2 కోట్ల లీటర్ల ఇంధన ఆదా జరిగిందని, 21 కోట్ల కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ను తగ్గించగలిగామని చెప్పారు. 

అత్యాదునిక సదుపాయాలతో.. 
ఎయిర్‌పోర్ట్‌లోనే కార్గో, ప్యాసింజర్‌ పేరిట రెండు మెట్రోస్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రయాణికులు తమ లగేజీని మోయాల్సిన అవసరం లేకుండా.. ప్యాసింజర్‌ మెట్రోస్టేషన్‌లో దిగిన తర్వాత నేరుగా ఎయిర్‌పోర్ట్‌ ప్రవేశద్వారం వద్దకు లగేజీ చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు ప్రవేశద్వారం వద్ద లగేజీని తీసుకోవచ్చు. 

►విమాన ప్రయాణికులు, వారి లగేజీని రాయదుర్గం మెట్రోస్టేషన్‌ వద్దే చెకింగ్‌ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. విమాన రాకపోకల సమయాలకు సంబంధించిన వివరాలను మెట్రోస్టేషన్లలో డిస్‌ప్లే చేస్తారు. 

►ఎయిర్‌పోర్ట్‌ మెట్రోలో మొదటిసారిగా ప్లాట్‌ఫాం స్క్రీన్డ్‌ డోర్స్‌ (పీఎస్‌డీ)ను ప్రవేశపెట్టనున్నారు. దీనిద్వారా రైలు వస్తున్న సమయంలో ప్లాట్‌ఫాంపై గేట్లు తెరుచుకుంటాయి. 

►రైలువేగం మరింతగా పెరిగేలా స్టెయిన్‌లెస్‌ లేదా అల్యుమినియంతో రూపొందించిన లైట్‌ వెయిట్‌ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

►ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తయ్యాక మొదట మూడు కోచ్‌లతో ప్రారంభిస్తారు. తర్వాత రద్దీని బట్టి ఆరు కోచ్‌లకు విస్తరిస్తారు. ఇందుకు అనుగుణంగా ప్లాట్‌ఫాంలను 6 కోచ్‌లకు అనుగుణంగా నిర్మించనున్నారు. 

►తొలుత రద్దీ సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో 20 నిమిషాలకో రైలు నడుపుతారు. తర్వాత అవసరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ పెంచుతారు. ఇక సిటీ మెట్రోకు భిన్నంగా ఎయిర్‌పోర్ట్‌ మెట్రోలో సీటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.  

మరిన్ని వార్తలు