తెలంగాణలో ఇక ప్రతియేటా కొలువులు

14 Jul, 2021 01:56 IST|Sakshi

జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం

కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా జిల్లాలకు సత్వరమే ఉద్యోగులను కేటాయించాలని ఆదేశం

రాజధాని శివారు మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.1,200 కోట్లు

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో స్థానిక విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్లు

నేడు కూడా కేబినెట్‌ భేటీ.. ఉద్యోగాల భర్తీ, భూముల విలువలు,రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇక నుంచి ప్రతి యేటా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగా భర్తీ ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రగతి భవన్‌లో కేబినెట్‌ భేటీ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం ఏడున్నర గంటలకు పైగా జరిగింది. ఉద్యోగాల భర్తీ, భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపు, రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి ప్రణాళికలు, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు తదితర అంశాలపై కేబినెట్‌ చర్చించింది. పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ అంశంతో పాటు భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుపై నిర్ణయాలు తీసుకునేందుకు బుధవారం కూడా సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ మరోమారు సమావేశం కానుంది. 

ఉద్యోగుల కేటాయింపుపై చర్చ
కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో, టీజీవో సంఘాలు సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశాయి. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేబినెట్‌ ఆ అంశంపై చర్చించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏడు జిల్లాల్లో పర్యటించిన ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు ఆ వివరాలను ఈ సందర్భంగా కేబినెట్‌కు తెలియజేశారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు, ఇచ్చిన సూచనలు, ఇతర క్షేత్రస్థాయి పరిశీలనలు వివరించారు. వ్యాక్సినేషన్‌ ప్రకియతో పాటు పడకలు, మందుల లభ్యత, మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యల గురించి సమాచారమిచ్చారు. కాగా రాష్ట్రంలో మందులు, ఆక్సిజన్‌ లభ్యతతో పాటు ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై కేబినెట్‌ చర్చించింది.

నెలరోజుల్లోపు వైకుంఠధామాలు పూర్తి చేయాలి
రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని వివరిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల అధికారులు మంత్రివర్గానికి నివేదికలు సమర్పించారు. దీనిపై చర్చించిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో నూరు శాతం వైకుంఠధామాల నిర్మాణాన్ని నెలరోజుల్లోపు పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. ఇకపై అన్ని గ్రామాల్లో వీధిదీపాల కోసం ‘మూడో వైర్‌’ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం రాజధాని శివారు మున్సిపాలిటీలకు రూ.1,200 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌.. తక్షణమే నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రజాప్రతినిధులను పిలవండి
ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, విద్యాసంస్థల్లో పరిస్థితిపై మంత్రివర్గం చర్చించింది. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన స్థానిక విద్యార్థినీ విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్‌ చైర్మన్‌లను విధిగా ఆహ్వానించాలని సంబంధిత అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.

ఉద్యోగాల భర్తీపై పూర్తి వివరాలతో రండి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ తయారు చేసిన నోట్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌. సోమేశ్‌కుమార్‌ కేబినెట్‌ ముందుంచారు. అన్ని ప్రభుత్వ శాఖలతో మాట్లాడి రూపొందించిన డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల వివరాలను ఆయన వివరించారు. దీనిపై మంత్రివర్గం చర్చించింది. కానీ తుది నిర్ణయం తీసుకోలేదు. దీని కోసం బుధవారం సమావేశమవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో సమావేశానికి హాజరుకావాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించింది. కాగా జిల్లాల్లోని జనాభా ప్రాతిపదికన కేడర్‌ స్ట్రెంగ్త్‌ నిర్ధారణ, జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ పోస్టుల్లో పొందుపర్చాల్సిన కేడర్‌లపై కూడా బుధవారం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

భూవిలువల పెంపుపై సుదీర్ఘ చర్చ
రాష్ట్రంలోని భూములకు ప్రభుత్వ ధరల సవరణతో పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుపై కూడా కేబినెట్‌లో చాలా సేపు చర్చించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన అభివృద్ధి కారణంగా పెరిగిన భూముల విలువలపై, ప్రభుత్వ సొంత ఆదాయ వనరులు పెంచుకునే మార్గాలపై సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. సీఎం కూడా దీనిపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. అయితే నిర్ణయాన్ని మాత్రం బుధవారానికి వాయిదా వేశారు. ఇందుకు సంబంధించిన అన్ని శాఖల కార్యదర్శులను బుధవారం నాటి సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇలావుండగా భూముల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) అంశంపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగినట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ల రాబడికి అడ్డుగా ఉన్న ఆగస్టు-2020 నాటి సర్క్యులర్‌కు బుధవారం జరిగే సమావేశంలో కొంత వెసులుబాటు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

అధికారులకు కేబినెట్‌ ఆదేశాలు

  • రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగ ఖాళీలను గుర్తించిన తర్వాత, వాటి భర్తీ కోసం వార్షిక నియామక క్యాలెండర్‌ (జాబ్‌ క్యాలెండర్‌) తయారు చేయాలి.
  • కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా జిల్లాల వారీగా పోస్టులు, అధికారుల కేటాయింపుతో పాటు ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియను సత్వరమే చేపట్టాలి.
  • కరోనా నియంత్రణకు మందులను అందుబాటులో ఉంచాలి. జ్వర సర్వేతో సహా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలి.
  • మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ప్రత్యేక లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. ఈ మేరకు అవకాశాలను అన్వేషించి విధివిధానాలను తయారు చేయాలి.
మరిన్ని వార్తలు