లాక్‌డౌన్‌, బడులు, కర్ఫ్యూనే మంత్రివర్గ అజెండా

19 Jun, 2021 02:59 IST|Sakshi
ఫైల్‌

21వ తేదీ నుంచి పాఠశాలల పునఃప్రారంభం

విద్యా సంవత్సరం ప్రారంభంపై నేడు కేబినెట్‌ నిర్ణయం

లాక్‌డౌన్‌ ఎత్తివేత.. రాత్రి కర్ఫ్యూపై కూడా..

నేడు మధ్యాహ్నం మంత్రివర్గం అత్యవసర భేటీ

సీజనల్‌ వ్యాధులు, నిధుల సమీకరణపైనా చర్చ

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసరంగా భేటీ కానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను కొనసాగించాలా, ఎత్తివేయాలా, మరిన్ని సడలింపులు ఇవ్వాలా? అన్న దానితోపాటు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సడలింపుతోపాటు.. ప్రజలు ఇళ్లకు చేరుకోవడానికి మరో గంట అదనంగా మినహాయింపు ఉంది. రాష్ట్రంలో కరోనా  పాజిటివిటీ రేటు, కరోనా కేసుల నమోదు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసి.. రాత్రి 9 గంటల నుంచి మరునాడు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను రాత్రి తొమ్మిదింటికే మూసేసి, ఇళ్లకు చేరుకోవడానికి ఒక గంట సమయం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. సినిమా హాళ్లు, షూటింగ్‌లు, థీమ్‌ పార్క్‌లు, జిమ్‌లు వంటి వాటికి అనుమతి ఇస్తారా, మరికొంత కాలం మూసే ఉంచుతారా అన్నది కూడా కేబినెట్‌ సమావేశంలో తేలనుంది. ఇక ఈ నెల 21వ తేదీ నుంచి విద్యా సంస్థల ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. దీనిపై కేబినెట్‌ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యా సంస్థలు తెరుచుకున్నా కొంతకాలం పాటు ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.

వ్యవసాయ అంశాలపైనా.. 
వానాకాలం మొదలైన నేపథ్యంలో.. సాగు, నకిలీ విత్తనాల బెడద ఎక్కువైన నేపథ్యంలో మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. రైతుబంధు పథకం కింద రైతాంగానికి అందిస్తున్న ఆర్థిక సాయం, విత్తనాలు, ఎరువుల లభ్యత అంశాలను చర్చిస్తారని చెబుతున్నారు. కాళేశ్వరం నుంచి ఇప్పటికే ఎత్తిపోతలు ప్రారంభమైన నేపథ్యం మరింత సమర్థవంతంగా గోదావరి నీటిని వినియోగించుకోవడంపై కూడా కేబినెట్‌ దృష్టి సారించనుంది. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశంతోపాటు కరోనా మూడో వేవ్‌ రావొచ్చనే ఆందోళన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. నిధుల సమీకరణకు సంబంధించి కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు