‘లోటు’ పాట్లపై లోతుగా..

14 Dec, 2021 04:13 IST|Sakshi

  టారిఫ్‌పై ఈఆర్సీ ఆదేశాల నేపథ్యంలో మంత్రుల సమావేశం

డిస్కంల ఆర్థికలోటు భర్తీకి ఉన్న అవకాశాలపై చర్చ 

తగు మార్గాలని కనుగొనాలని ఉన్నతాధికారులకు సూచన

 చార్జీల పెంపు ప్రతిపాదనలపై అనుమతి కోరిన అధికారులు

 మరోసారి సమావేశమై చర్చించాలని మంత్రుల నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ టారిఫ్‌ సవరణ(చార్జీల పెంపు) ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు, విద్యుత్‌మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సోమవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం, ఆ వ్యత్యాసాన్ని పూడ్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌)లను డిస్కంలు గత నెల 30న ఈఆర్సీకి సమర్పించిన విషయం తెలిసిందే. ఏఆర్‌ఆర్‌తోపాటే సమర్పించాల్సిన టారిఫ్‌ పెంపు ప్రతిపాదనలను అప్పట్లో డిస్కంలు వాయిదా వేసుకున్నాయి. 

భారీ ఆదాయలోటులో ఉన్న డిస్కంల మనుగడ కోసం చార్జీలు పెంచకతప్పదని ఇప్పటికే ఈఆర్సీ స్పష్టం చేసింది. ఆదాయలోటు పూడ్చుకోవడానికి ప్రభుత్వ సబ్సిడీలను పెంచేందుకున్న అవకాశాలు ఏమిటి? సబ్సిడీలుపోగా మిగిలి ఉండే లోటు పూడ్చుకోవడానికి ఏ మేరకు టారిఫ్‌ పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పించాలి? అన్న అంశాలపై మంత్రులు లోతుగా చర్చించారు. ఆర్థికలోటు పూడ్చడానికి ఉన్న ఇతర మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి సునీల్‌ శర్మ, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావులకు సూచించారు. డిస్కంల ఆర్థిక పరిస్థితి, టారీఫ్‌ ప్రతిపాదనలపై మరో మారు భేటీ కావాలని నిర్ణయించారు.  

విద్యుత్‌పై భారీగా పెట్టుబడులు.. 
రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.వేల కోట్ల పెట్టుబడులు, వ్యయప్రయాసలతో రాష్ట్ర విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యాన్ని భారీగా పెంచినట్టు అధికారులు మంత్రులకు నివేదించారు. జెన్‌కో స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 16,623 మెగావాట్లకు పెరిగిందన్నారు. విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.33,722 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌లో 2,700 మెగావాట్ల లోటు ఉండేదని, కేవలం 6 నెలల్లోనే కోతలు అధిగమించి అన్ని రంగాలకు 24 గంటల నిరంతర సరఫరా చేస్తున్నామని వివరించారు. సౌర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 74 మెగావాట్లు నుంచి 3997 మెగావాట్లకు, గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 5,661 మెగావాట్ల నుంచి 13,688 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. వినియోగదారుల సంఖ్య కోటీ 11 లక్షల నుంచి కోటీ 68 లక్షలకు, తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2,012 యూనిట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 19 లక్షల నుంచి 25.92 లక్షలకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు పెరిగాయన్నారు. ట్రాన్స్‌కో పరిధిలోని సబ్‌ స్టేషన్ల సంఖ్య 233 నుంచి 361కు పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు పెరిగిన ఆర్థిక అవసరాలకు తగ్గట్టు విద్యుత్‌ సంస్థల విద్యుత్‌ టారిఫ్‌ పెంచుకోవడానికి అనుమతికోరినట్టు తెలిసింది.   

మరిన్ని వార్తలు