Lockdown: పొడిగించాలా? వద్దా?.. 30న తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం..!

27 May, 2021 02:25 IST|Sakshi

లాక్‌డౌన్‌పై 30న రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయం

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించాలా? వద్దా? అన్న అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. దీని కోసం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీ జరగనుంది. కరోనా రెండో వేవ్‌ ఉధృతిని నియంత్రిం చడానికి ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ విధించగా, ఇప్పటికే ఒకసారి పొడిగిం చారు. ఈ నెల 30తో ఇది ముగియ నుంది. లాక్‌డౌన్‌ ఫలితంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మరికొన్ని రోజులపాటు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

కొత్తగా సడలింపులు, మినహాయింపులు ఇచ్చి మరో వారం పది రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగించవచ్చని సమాచారం. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో పొడిగింపునకే ప్రభుత్వం మొగ్గు చూపనుంది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు అమలు చేస్తున్నారు. దీన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పెంచాలని వ్యాపార వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ అంశంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

స్థిరాస్తి రంగ వ్యాపారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు నిర్మాణ రంగ ప్రాజెక్టుల పనులు కొనసాగించేందుకు కొత్తగా సడలింపులిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే సిమెంట్, స్టీల్, హార్డ్‌వేర్‌ దుకాణాలకు సడలింపులు ఇచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకోనుంది. కాగా.. వానాకాలం పంటల సాగు ఏర్పాట్లు, ఎరువులు, విత్తనాల సరఫరా తదితరాలపై కేబినెట్‌ చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. రైతుబంధు సొమ్ము పంపిణీపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు