తెలంగాణ: ఆందోళన కలిగిస్తోన్న కేన్సర్‌ కేసులు, మరణాలు

4 Aug, 2021 09:03 IST|Sakshi

ఏటా పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి 

రొమ్ము, నోరు, గర్భాశయం, ఊపిరితిత్తుల కేన్సర్లు ఎక్కువ

తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద జరుగుతున్న చికిత్సల్లో ఈ వ్యాధిదే ప్రథమ స్థానం 

కేన్సర్‌ మరణశిక్ష కాకూడదు 
కేన్సర్‌ ఎక్కడా, ఎవరికీ మరణశిక్ష కాకూడదు. వ్యాధిని ముందుగా గుర్తించేలా ప్రజలు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. కాలేయ క్యాన్సర్‌ను నివారించడానికి ప్రభుత్వాలు హెపటైటిస్‌ బీ టీకాలు వేయాలి. 
– డబ్ల్యూహెచ్‌ఓ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేన్సర్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరణాలు సైతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో గత ఏడాది వరకు మూడేళ్ల వ్యవధి (2018–20 మధ్య)లో 1.39 లక్షల మంది కేన్సర్‌ బారిన పడగా.. అదే కాలంలో 76,234 మంది మరణించడం వ్యాధి విస్తరిస్తున్న తీరును, దాని తీవ్రతను స్పష్టం చేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా నమోదైన కేన్సర్‌ మరణాల్లో తెలంగాణ 13వ స్థానంలో ఉండటం గమనార్హం. దేశంలో ఈ మూడేళ్లలో 40.75 లక్షల మంది కేన్సర్‌ బారినపడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. రొమ్ము, నోరు, గర్భాశయం, ఊపిరితిత్తులు, కడుపు, పెద్దపేగు, కాలేయ క్యాన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది. ఇలావుండగా కేన్సర్‌ కేసుల్లో 25 శాతం పొగాకు సంబంధించినవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంటోంది. కాగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద జరుగుతున్న చికిత్సల్లో ఈ మహమ్మారే మొదటి స్థానంలో ఉంది. 

► రాష్ట్రంలో మూడేళ్లలో మృతులు 76,234
► 2018–20 మధ్య మొత్తం కేసులు 1.39 లక్షలు

పొగాకు వాడకాన్ని  నియంత్రించాలి: డబ్ల్యూహెచ్‌ఓ 
పురుషులలో పొగాకు సంబంధిత కేన్సర్‌ కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంటోంది. పొగాకు వాడకాన్ని నియంత్రించడం అవసరమని సూచిస్తోంది. మహిళల్లో గర్భాశయ కేన్సర్‌ ఎక్కువగా ఉందని తెలిపింది. అధిక బరువు, తక్కువ స్థాయి శారీరక శ్రమ, జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల కేన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని వివరించింది. గత రెండు దశాబ్దాలలో కేన్సర్‌ ప్రమాదం పెరిగిందని వెల్లడించింది. ఇలాగే కొనసాగితే రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు 60 శాతం పెరుగుతాయని హెచ్చరించింది.  

ఎక్కువ శాతం కేన్సర్‌ చికిత్సలే.. 
తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద 2016–17లో మొత్తం 2.74 లక్షల మందికి వివిధ రకాల వ్యాధులకు శస్త్రచికిత్సలు జరిగితే, అందులో 64,845 మంది కేన్సర్‌ రోగులు ఉన్నారు. అంటే 23.61 శాతం కేన్సర్‌ చికిత్సలేనన్న మాట. అలాగే 2017–18లో 3.09 లక్షల మందికి చికిత్సలు జరిగితే, అందులో 71,273 మంది కేన్సర్‌ బాధితులు ఉన్నారు.  

అంకాలజిస్టులు 100 మందే 
రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులకు కేన్సర్‌ నిర్ధారణపై ఎటువంటి అవగాహన ఉండక పోవడంతో వ్యాధిని ముందస్తుగా గుర్తించలేక పోతున్నారు. కేన్సర్‌ నిర్ధారణ, చికిత్స చేసేందుకు అవసరమైన వైద్య సిబ్బంది కూడా రాష్ట్రంలో లేరు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం 100 మంది వరకు మాత్రమే ఆంకాలజిస్టులు ఉన్నారు. అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30 మందే ఉన్నారు.  

ప్రత్యేక శిక్షణకు  కేంద్రం నిర్ణయం 
కేన్సర్‌ను గుర్తించలేదని పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) మొదలు ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్లా పనిచేసే ప్రభుత్వ వైద్యులకు క్యాన్సర్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. 

అవగాహన పెరగాలి 
కేన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉంది. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక ప్రకారం.. మన దేశంలో కేన్సర్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ప్రతి 10 మంది భారతీయులలో ఒకరు క్యాన్సర్‌ బారిన పడతారని, ప్రతి 15 మందిలో ఒకరు మరణిస్తారని సంస్థ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. శారీరక శ్రమ చేయాలి. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.  
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ  

మరిన్ని వార్తలు