భూ బదలాయింపు బాధ్యత తహసీల్దార్లకే.. 

24 Feb, 2023 02:40 IST|Sakshi

జీవో 59 కింద క్రమబద్ధీకరణకు ఓకే అయిన భూములకు కన్వేయన్స్‌ డీడ్‌లు 

మార్గదర్శకాలు జారీ చేసిన సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌ 

చదరపు గజానికి రూ.7వేలలోపు ప్రభుత్వ ధర ఉన్నచోట లైన్‌ క్లియర్‌ 

తహసీల్దార్ల లాగిన్‌లోకి డీడ్‌లు.. వారి సంతకాలతోనే జారీ 

ఎలాంటి చార్జీలు చెల్లించకుండానే ఈ డీడ్‌ల రిజిస్ట్రేషన్‌ 

ఎక్కువ ధర ఉన్న స్థలాలపై నిర్ణయం ఇంకా పెండింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన జీవో 59 అమలు ఓ కొలిక్కి వస్తోంది. క్రమబద్ధీకరణకు ఆమోదం పొంది, ఫీజు పూర్తిగా చెల్లించిన దరఖాస్తుదారుల పేరిట సదరు భూములను బదలాయించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ మార్గదర్శకాలను జారీ చేశారు.

ఈ భూములను బదలాయించే బాధ్యత తహసీల్దార్లకు అప్పగించారు. తహసీల్దార్ల లాగిన్లలో ఈ డీడ్‌లను అందుబాటులో ఉంచాలని, వాటిపై తహసీల్దార్ల సంతకం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు.. జీవో 59 కింద ఆమోదం పొందిన భూములకు సంబంధించిన కన్వేయన్స్‌ డీడ్‌లను సబ్‌ రిజిస్ట్రార్లు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది.

తద్వారా ఇప్పటివరకు కేవలం ఆక్రమణదారులుగా ఉన్న వేలాది మందికి ఆ స్థలాలపై పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. ఆ భూములను అవసరమైతే విక్రయించుకోవడానికి కూడా హక్కు లభించనుంది. సీసీఎల్‌ఏగా బాధ్యతలు స్వీకరించాక నవీన్‌ మిత్తల్‌ తొలిసారి జారీచేసిన అధికారిక ఉత్తర్వులు జీవో 59కి సంబంధించినవే కావడం, ఈ ప్రక్రియ పూర్తి బాధ్యతలను తహసీల్దార్లకే అప్పగించడం గమనార్హం. 

తక్కువ ధర ఉన్న ప్రాంతాల్లో.. 
రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లుకట్టుకున్న పేదలకు వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవో 58, 59లను జారీ చేసింది. వీటికింద గత ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తులను స్వీకరించారు. జీవో 58 కింద ఉచితంగా, 59 కింద ప్రభుత్వం నిర్ధారించిన ఫీజును కట్టించుకుని.. సదరు స్థలాలను క్రమబద్ధీకరించేలా చర్యలు చేపట్టారు. జీవో 59 కింద క్రమబద్ధీకరణ కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.

ఇందులో ప్రభుత్వ విలువ చదరపు గజానికి రూ.7 వేల కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని దరఖాస్తులను పరిశీలించి ఆమోదం తెలిపారు. ఇవి 25వేల వరకు ఉంటాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి కన్వేయన్స్‌ డీడ్‌లను జారీ చేసేందుకు సీసీఎల్‌ఏ తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ విలువ రూ.7 వేల కంటే అధికంగా ఉన్న స్థలాల విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో కసరత్తు చేస్తోందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.  

సీసీఎల్‌ఏ జారీ చేసిన మార్గదర్శకాలివీ.. 
►జీవో 59 కింద ఆమోదం పొంది, నిబంధనల మేరకు ప్రభుత్వానికి ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు సంబంధించిన కన్వేయన్స్‌ డీడ్‌ (భూబదలాయింపు డాక్యుమెంట్‌æ) తహసీల్దార్‌ లాగిన్‌లోకి వస్తుంది. 

►తహసీల్దార్లు మీసేవ వెబ్‌ పోర్టల్‌ ద్వారా లాగిన్‌ కావాల్సి ఉంటుంది. అందులో జీవో 59 కింద కన్వేయన్స్‌ డీడ్‌లను ప్రాసెస్‌ చేసే ఆప్షన్‌ ఉంటుంది. 

►తహసీల్దార్‌ బయోమెట్రిక్‌ నమోదు చేసి ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు. లాగిన్‌లో దరఖాస్తు నంబర్, గ్రామాల వారీగా కన్వేయన్స్‌ డీడ్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ కన్వేయన్స్‌ డీడ్‌లలో లబ్ధిదారుల పూర్తి వివరాలను నమోదు చేయడంతోపాటు పాటు జారీచేసే పూర్తి బాధ్యతలను తహసీల్దార్‌ నిర్వర్తించాల్సి ఉంటుంది. 

►సదరు దరఖాస్తును ఆమోదించడంతో కన్వేయన్స్‌ డీడ్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకునే ముందే అన్ని వివరాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. 

►డౌన్‌లోడ్‌ అయిన డీడ్‌ (మూడు పేజీలు) ప్రింట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రింట్‌పై తహసీల్దార్‌ సంతకం చేయడంతోపాటు ఆఫీస్‌ స్టాంప్‌ వేయాల్సి ఉంటుంది. 
►ఇలా తహసీల్దార్‌ సంతకం చేసిన కన్వేయన్స్‌ డీడ్‌లను సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ వంటివేవీ వసూలు చేయకూడదు. 

►ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసిన ఈ డాక్యుమెంట్‌ను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. ఇలా అందజేసే సమయంలో తహసీల్దార్‌ జారీచేసిన కన్వేయన్స్‌ డీడ్‌ను, సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్‌ను లబ్ధిదారుడికి ఇవ్వాలి. 

►కన్వేయన్స్‌ డీడ్‌ కాపీని మీసేవ పోర్టల్‌లో కూడా అప్‌లోడ్‌ చేయడంతో జీవో 59 కింద సదరు భూమిని లబ్ధిదారుడికి బదలాయించే ప్రక్రియ ముగుస్తుంది.   

మరిన్ని వార్తలు