అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు!

15 May, 2022 02:10 IST|Sakshi

టెన్త్‌ పరీక్షలకు సీసీ కెమెరాల చిక్కు

కొనుక్కుంటే తక్కువ ధరకు అందుబాటులో..

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 23 నుంచి మొదలయ్యే టెన్త్‌ పరీక్షలకు సీసీ కెమెరాల ఏర్పాటు సమస్యగా మారింది. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ ఈసారి సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల బండిల్‌ను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. పరీక్ష కేంద్రం నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆన్‌లైన్‌ లింక్‌ ఉండాలని, అన్ని స్థాయిల్లోనూ పర్యవేక్షణ ఉండాలని స్పష్టంచేసింది.

అయితే, ఇందుకోసం వాడే సీసీ కెమెరాలను అద్దెకు మాత్రమే తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. హైదరాబాద్‌లో పెద్ద ఇబ్బందులు లేనప్పటికీ.. జిల్లా కేంద్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఇదో సమస్యగానే అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,400 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతీ కేంద్రంలో చీఫ్‌ ఎగ్జామినర్‌ వద్ద సీసీ కెమెరా ఉండాలి. అక్కడి నుంచి ఇంటర్నెట్‌ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి లింక్‌ ఉంటుంది.

అయితే, ప్రతీ జిల్లాలోనూ కనీసం 200 పరీక్ష కేంద్రాలుంటే, అన్ని సీసీ కెమెరాలు అద్దెకు లభించడం కష్టంగా ఉంది. జిల్లా కేంద్రాల్లో కొద్ది మొత్తంలో ఉన్నా, రోజుకు కనీసం రూ.1,500 వరకూ అద్దె అడుగుతున్నారు. వైఫై, ఇతర ఇన్‌స్టలేషన్‌ చార్జీలు అదనం. కనీసం పది రోజులు ఒక కెమెరా పరీక్ష కేంద్రంలో ఉంచినా, రూ.15 వేల వరకూ చెల్లించాలి. అయితే, మార్కెట్లో ఒక్కో కెమెరా కొనుగోలు చేసినా ఇంతకంటే తక్కువగా దొరుకుతుందని అంటున్నారు. పెద్ద మొత్తంలో సమకూర్చుకోవడం కష్టమైనప్పుడు వేరే ప్రాంతాల నుంచి ఇంత తక్కువ సమయంలో తెప్పించడం ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఇదే అదనుగా ప్రైవేటు వ్యక్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎక్కువ మొత్తాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే, జిల్లా కలెక్టరేట్‌ అధికారులు మాత్రం తక్కువ రేటుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది కలెక్టర్లు మాత్రం ఈ బాధ్యతను రాష్ట్రస్థాయిలోనే ఏదైనా సంస్థకు ఇస్తే బాగుంటుందని, జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయలేమని విద్యాశాఖకు చెప్పినట్లు తెలిసింది. అయితే, పాఠశాల విద్య డైరెక్టర్‌ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాగు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

మాకు మిగిలేదేంటి 
కొద్దిరోజుల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా, బిగింపునకు అయ్యే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. వీటన్నింటినీ కలుపుకొనే మేం రోజుకు రూ.1,500 అద్దెతో ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్షల తర్వాత వాటిని తొలగించినా, వాడిన వైరు, ఇతర ఉపకరణాలను ఏమీ చేసుకోలేం. అదీగాక నెట్‌ సౌకర్యం లేని ప్రాంతంలో తాత్కాలిక నెట్‌ సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ కలుపుకొంటే మాకు మిగిలేది పెద్దగా ఏమీ ఉండదు. 
– డి.వేణు (సీసీ కెమెరాల నిర్వాహకుడు)  

మరిన్ని వార్తలు