ఎస్సారెస్పీ, ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్లేవు

18 Aug, 2021 01:04 IST|Sakshi

ఇంద్రావతి నీటిని ఛత్తీస్‌గఢ్‌ వినియోగిస్తే దిగువకు నీళ్లే రావు 

ముందుగా మహానది–గోదావరి అనుసంధానం చేపట్టాలి 

ఎన్‌డబ్ల్యూడీఏ భేటీలో తెలంగాణ స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియపై తమ అభ్యంతరాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ మరోసారి కేంద్రానికి స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ, ఇచ్చంపల్లి మధ్య తెలంగాణ అవసరాలు పోను, మరో 176 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని, ఆ నీటిని అనుసంధాన ప్రక్రియలో వినియోగిస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్సారెస్పీ–ఇచ్చంపల్లి మధ్య మిగులు జలాల్లేవని, లభ్యత నీటిని వాడుకునేలా ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని తెలిపింది. గోదావరి–కావేరీ నదుల అనుసంధానంపై మంగళవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ భూపాల్‌సింగ్‌ నేతృత్వంలోని గవర్నింగ్‌ బాడీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయ సేకరణ చేసింది. 

ఈ భేటీకి తెలంగాణ తరఫున అంతర్రాష్ట్ర విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని కావేరీకి తరలించేలా చేసిన ప్రతిపాదనలపై పలు అభ్యంతరాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోలేని 247 టీఎంసీల నీటిని అనుసంధానం ద్వారా తరలిస్తామని కేంద్రం చెబుతున్నా.. దీనికి  ఛత్తీస్‌గఢ్‌ వ్యతిరేకిస్తున్న విషయాన్ని రాష్ట్ర ఇంజనీర్లు ఎత్తిచూపారు. భవిష్యత్తులో ఇంద్రావతి నీటిని ఛత్తీస్‌గఢ్‌ వినియోగిస్తే మిగులు జలాలు ఎలా ఉంటాయో కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. కాగా, గోదావరిలో మిగులు జలాలే లేవని పునరుద్ఘాటించారు. 

ఈ దృష్ట్యా గోదావరి–కావేరీ అనుసంధానం కన్నా ముందు మహానది–గోదావరి అనుసంధానం చేయాలని, మహానది నుంచి నీటిని తరలించాకే కావేరీకి నీటిని తీసుకెళ్లాలని వెల్లడించారు. దీంతోపాటు ఈ అనుసంధాన ప్రక్రియలో నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా వాడుకుంటామన్న ప్రతిపాదనను తెలంగాణ తప్పుపట్టింది. సాగర్‌కు ఉన్న నీటి కేటాయింపులు, దాని ఆపరేషన్‌ ప్రొటోకాల్‌పై ఇంతవరకు స్పష్టత లేదని, దీనిపై ట్రిబ్యునల్‌ తేల్చాల్సి ఉందని, అది జరగకుండా సాగర్‌ను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మార్చడం లేక అటు నుంచి నీటిని తరలించడం సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు