రైతుబంధు పథకం తరహాలో త్వరలో చేనేతబంధు?

7 Aug, 2021 02:47 IST|Sakshi

చేనేత, జౌళిశాఖను పరిశ్రమల శాఖ నుంచి తప్పించే అవకాశం

స్వతంత్ర హోదా కల్పించే యోచనలో సర్కారు

కసరత్తు ప్రారంభించిన అధికారులు

18–59 ఏళ్ల వయసుగల నేత కార్మికులకు వర్తింపు!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం రైతుబంధు తరహాలో త్వరలో చేనేతబంధు పథకాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు, ఈ రంగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పరిశ్రమల శాఖకు అనుబంధ విభాగంగా ఉన్న చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి కార్యదర్శిని నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ శాఖకు కమిషనర్‌ హోదాలో ఉన్న అధికారి పనిచేస్తుండగా పరిశ్రమల శాఖ నుంచి విభజన తర్వాత కార్యదర్శి హోదాలో అధికారిని నియమించే అవకాశమున్నట్లు సమాచారం.

తెలంగాణ టెక్స్‌టైల్‌ అండ్‌ అపెరల్‌ పాలసీ (టీ–టాప్‌)ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ తరహా మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు చేనేత బంధు పథకం మార్గదర్శకాలకు చేనేత విభాగం తుదిరూపు ఇచ్చినట్లు తెలియవచ్చింది. 18 నుంచి 59 ఏళ్ల వయసుగల సుమారు 70 వేల మందికి ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ఇప్పటికే నేత కార్మికుల వివరాలను అధికారులు సేకరించారు. సహకార రంగంతోపాటు సహకారేతర రంగం వారికి కూడా చేనేతబంధు పథకాన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. త్వరలో చేనేత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

సెప్టెంబర్‌ 1 నుంచి మళ్లీ ‘నేతన్నకు చేయూత’... 
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‘నేతన్నకు చేయూత’పథకాన్ని శనివారం తిరిగి ప్రారంభించనున్నారు. నేత కార్మికుల పొదుపు కోసం ఉద్దేశించిన ఈ పథకం కింద కార్మికులు తమ వంతు వాటాగా 8 శాతం నిధులు జమ చేస్తే పరిశ్రమలశాఖలోని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం మరో 16 శాతం నిధులను జోడించనుంది. ఈ పథకం కోసం ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 338 కోట్లు కేటాయించగా నాలుగు రోజుల క్రితం ఈ పథకానికి మరో రూ. 30 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ పథకంపై ఆసక్తి ఉన్న కార్మికులు సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి తమ వివరాలు నమోదు చేసుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఈ పథకం కింద 26 వేల మందికిపైగా కార్మికులు పేర్లు నమోదు చేసుకొని రూ. 31 కోట్లు పొదుపు చేయగా ప్రభుత్వం రూ. 62 కోట్లు తన వంతు వాటాగా చెల్లించింది. మూడేళ్ల తర్వాత కార్మికులు రూ. 50 వేల నుంచి రూ. 1.25 లక్షల వరకు రుణం తీసుకొనే వెసులుబాటు ఉండగా కరోనా నేపథ్యంలో గతేడాది మేలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి కార్మికులకు నిధులు విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు