కొండెక్కిన చికెన్‌ ధరలు.. రెండు నెలలైనా తగ్గని ధర.. గుడ్డుతోనే సరి!

19 Oct, 2021 18:27 IST|Sakshi

సాక్షి, నారాయణఖేడ్‌: ఇంట్లో ఏ ఫంక్షన్‌ అయినా చికెన్‌ ముక్క లేకుండా ముగియదు. రోజురోజుకు పెరుగుతున్న చికెన్‌ ధరలు సామాన్యుడికి ముక్క చిక్కకుండా చేస్తున్నాయి. రెండు నెలలుగా చికెన్‌ ధరలు కొండెక్కాయి. కిలో చికెన్‌ రూ.280 నుంచి రూ.300లకు కిందకు దిగనంటోంది. గత నెల శ్రావణమాసంలో చికెన్‌ ధరలు తగ్గుతాయని ఆశించినా, కిలో రూ.260 రికార్డు ధర పలికింది. పెళ్లిళ్ల సీజన్‌తో ఈ ధర మరింత పైకి ఎగబాకింది. అనంతరం ధరలు తగ్గుతాయని ఆశించినా తగ్గడంలేదు. సాధారణ సమయంలో రిటైల్‌ లైవ్‌ బర్డ్‌ కిలో రూ.80 నుంచి రూ.100వరకు ఉండగా, ప్రస్తుతం రూ.145 నుంచి రూ.150వరకు పలుకుతోంది. మటన్‌ ఒక్కో ప్రాంతంలో రూ.600 నుంచి రూ.700 వరకు ఉంది.  

తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన డిమాండ్‌ 
వేసవి నుంచి చికెన్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా మాంసాహారం తినాలన్న ప్రచారంతో చాలా మంది డ్రైప్రూట్స్‌తో పాటు మాంసాహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. దీంతో చికెన్‌కు డిమాండ్‌ పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, కొనుగోళ్లు పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయి.  

గుడ్డుతోనే సరి..  
చాలామంది మాంసం ధరలు పెరగడంతో గుడ్డుతోనే సరిపెడుతున్నారు. ఓ వారం మాంసం కొనుగోలు చేస్తే మరో వారం గడ్డుతో కానిచ్చేస్తున్నారు. కోడి గుడ్డు ధర రూ.6 వరకు పలుకుతోంది. గుడ్లు ఒకటి రూ.4నుంచి రూ.4.50కు విక్రయించే వారు వీటి ధరలు కూడా పెరిగి రూ.6కు తగ్గనంటోంది.

మరిన్ని వార్తలు