సీఎస్‌ సోమేశ్‌ బదిలీ?

4 May, 2022 01:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ బదిలీకి రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే సోమేశ్‌ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2023లో ఎన్నికలు జరిగే వరకు సోమేశ్‌ కుమార్‌ సీఎస్‌గా కొనసాగుతారని భావించినా.. ఇటీవలి పరిణామాలను చూస్తే ఆయన బదిలీ తప్పదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల సోమేశ్‌ కుమార్‌ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో ఢిల్లీలో గత వారం నిర్వహించిన సదస్సులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ సీఎస్‌ తీరును వివరించారు. సీఎం కేసీఆర్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, సోమేశ్‌ కుమార్‌తో ఇటీవల తాను సమావేశమైనప్పుడు న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు సమస్యలను వారికి వివరించానని, వాటిపై కేసీఆర్‌ స్పందించి.. రెండు రోజుల్లో పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించారని, అయినా నేటి వరకు సీఎస్‌ నుంచి సరైన స్పందన లేదని హైకోర్టు సీజే.. జస్టిస్‌ ఎన్‌వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలోనే సీజేఐ.. ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే కలిసి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్‌ పెండింగ్‌లో పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితోపాటు సీఎస్‌ ఒంటెద్దు పోకడలు పోతున్నారని, కొంతమంది ఉన్నతాధికారులను మినహా ఇతరులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ధరణి పోర్టల్లోని పొరపాట్లను దిద్దడంలో విపరీతమైన జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.

హైకోర్టులో కూడా సీఎస్‌పై అనేక వ్యాజ్యాలు నడుస్తున్నాయి. దీనికితోడు ఆయనను ఏపీకి పంపించాలని కేంద్రం సైతం పిటిషన్‌ వేయడంపై విచారణ జరుగుతోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సోమేశ్‌ బదిలీ జరుగుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఆయన స్థానంలో భర్తీ చేయడానికి సీనియర్‌ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు.   

మరిన్ని వార్తలు