అభిషేక్‌ను రెండు వారాల్లో తీసుకోండి

26 Feb, 2022 01:28 IST|Sakshi

లేదంటే సీఎస్‌ సోమేశ్‌ను ఏపీకి కేటాయించాలని ఆదేశిస్తాం: క్యాట్‌

కోర్టు ధిక్కరణ కేసులో ట్రిబ్యునల్‌ ముందు హాజరుకాని సీఎస్‌ 

సోమేశ్‌ అరెస్టుకు వారెంట్‌ జారీ చేస్తామన్న ధర్మాసనం 

గంట సమయం ఇవ్వడంతో ఆన్‌లైన్‌లో సీఎస్‌ హాజరు 

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ మొహంతిని రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర కేడర్‌లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సోమేశ్‌కుమార్‌ను ముందుగా ఏపీకి కేటాయించగా తామిచ్చిన ఆదేశాలతో తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్నారని గుర్తుచేసింది. అభిషేక్‌ మొహంతి కేసులో తమ ఆదేశాలను అమలు చేయకపోతే గతంలో తామిచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించి సోమేశ్‌ను తిరిగి ఏపీ కేడర్‌కు పంపుతామని హెచ్చరించింది.

ఈ మేరకు క్యాట్‌ సభ్యులు ఆశిష్‌కాలియా, బీవీ సుధాకర్‌ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ అభిషేక్‌ మొహంతి దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో విచారించిన క్యాట్‌.. తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలంటూ 8 నెలల క్రితం ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో అభిషేక్‌ కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణలో భాగంగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది.

కోర్టుధిక్కరణ పిటిషన్‌ మరోసారి విచారణకు రాగా.. సీఎస్‌ తరఫున కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ అభ్యర్థించారు. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో సీఎస్‌ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని, గంట సమయం ఇస్తున్నామని, ఈలోగా హాజరుకాకపోతే సీఎస్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం హె చ్చరించింది. దీంతో కొద్దిసేపటి తర్వాత సీఎస్‌ ఆన్‌లైన్‌లో ధర్మాసనం ఎదుట హాజరయ్యారు.

ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కేడర్‌ కేటాయింపులు చేసే అధికారం కేంద్రానికి ఉందని, ఈ నేపథ్యంలో క్యాట్‌ ఆదేశాలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రా నికి నివేదించామని సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. రెండు వారాల్లోగా అభిషేక్‌ను తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 వారాల తర్వాతకు వాయిదా వేసింది. కాగా, సోమేశ్‌తోపాటు ఇతర అధికారులను తెలంగాణకు కేడర్‌కు కేటాయించాలంటూ క్యాట్‌ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్రం ఇప్పటికే హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు