బతుకమ్మా... బతుకు ఇవ్వమ్మా... 

11 Oct, 2021 00:57 IST|Sakshi

వేడుకల్లో తలసేమియా చిన్నారులు

ఖమ్మం మయూరిసెంటర్‌: బతుకమ్మ... నేల మీద కురిసే పూల వెన్నెల. పూలంటే ఓ ఆశ. పూల పండుగ బతుకమ్మ అంటే.. బతుకుకు భరోసానిస్తుందనే విశ్వాసం. ఆ నమ్మకంతోనేనేమో ఆ చిన్నారులు ఆడిపాడారు. తలసేమియాతో బాధపడుతున్న తమకు ‘బతుకు ఇవ్వమ్మా.. బతుకమ్మా.. ’అంటూ వేడుకున్నారు. ఖమ్మంలోని రోటరీ క్లబ్‌ లింబ్‌ సెంటర్‌లో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్‌ ఆధ్వ ర్యంలో తలసేమియా చిన్నారులతో ఆదివారం బతు కమ్మ వేడుకలు నిర్వహించారు.

భారీ బతుకమ్మను తయారు చేసి... పిల్లలు ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. తమకు అవసరమైన రక్తాన్ని నెలనెలా దానం చేస్తూ కాపాడుతున్న దాతలను చల్లగా చూడాలని, తమ ఆయుష్షు పెంచాలని బతుకమ్మను వేడుకున్నారు. ఈ వేడుకల్లో కార్పొరేటర్‌ పగడాల శ్రీవిద్య, వైద్యులు డి.నారాయణమూర్తి, సతీష్, సంస్థ బాధ్యులు ప్రొద్దుటూరి పావని, పి.రవిచందర్, అనిత, ఉదయ్‌భాస్కర్, శివ, రాజేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని, చిన్నారులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.  

మరిన్ని వార్తలు