దర్యాప్తుపై ‘ముద్ర’కు  సీఐడీ వెనకడుగు! 

20 Apr, 2022 01:20 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా ముద్ర సొసైటీపై పలు కేసులు 

రైతుల నుంచి డిపాజిట్ల పేర వసూలు 

ఉద్యోగాల పేరిట 1,780 మంది నుంచి రూ.లక్ష చొప్పున వసూలు 

ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తన వద్ద ఉంచుకొని వేధిస్తున్న సొసైటీ చైర్మన్‌  

మొత్తంగా రూ.200 కోట్ల మేర స్కాం జరిగినట్టు అంచనా 

సాక్షి, హైదరాబాద్‌: కుంభకోణాల్లోనే ఈ సొసైటీది ప్రత్యేక ‘ముద్ర’. ఏకంగా తన ఉద్యోగులందరికీ టోకరా వేసింది. పెద్ద ఎత్తున రైతులకు కుచ్చుటోపి పెట్టింది. వీరి వద్ద నుంచి సుమారు రూ.200 కోట్ల మేర స్వాహా చేసింది. అయితే ఈ సొసైటీ అక్రమాలపై దర్యాప్తునకు సీఐడీ వెనుకడుగు వేయడం గమనార్హం. అదే ‘ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌’. నల్లగొండ, రామాయంపేట, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఈ సొసైటీపై కేసులు నమోదయ్యాయి.  

ఇదీ కుంభకోణం కథ... 
తిప్పినేని రామదాసప్పనాయుడు అనే వ్యక్తి చైర్మన్‌గా ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఏర్పాటైంది. ఇది ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీం కింద ఏర్పాటు చేసిన సంస్థగా అందరినీ నమ్మించాడు. హైదరాబాద్‌లోని నల్లకుంటలో హెడ్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేశాడు. అగ్రికల్చర్‌ సొసైటీ పేరుతో ప్రతి జిల్లాల్లో రైతుల నుంచి రూ.50 వేల చొప్పున డిపాజిట్లు వసూలు చేశాడు. మండలాలు, డివిజన్లలో సొసైటీ కార్యాలయాలను ఏర్పాటు చేసి మేనేజర్, క్యాషియర్‌ లాంటి ఉద్యోగులను నియమిం చాడు.

రెండేళ్ల తర్వాత సొసైటీ పూర్తిస్థాయిలో బ్యాంకుగా మారుతుందని చెప్పి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.లక్ష వసూలు చేసి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తన వద్ద సెక్యూరిటీగా పెట్టించుకున్నాడు. నెలకు రూ.20 వేల జీతం చెల్లిస్తానని చెప్పి రూ.4 వేలు, రూ.8 వేల చొప్పున చెల్లిస్తూ వచ్చాడు. అయితే మూడు నెలల్లోనే రామదాసప్పనాయుడు నుంచి ఉద్యోగులకు వేధింపులు మొదలయ్యాయి.

డిపాజిట్ల రూపంలో మరింత ఎక్కువ సొమ్ము వసూలు చేయాలని హుకుం జారీచేశాడు. దీంతో ఉద్యోగులు ఒత్తిడికిలోనై రాజీనామాలు సమర్పించగా క్రిమినల్‌ కేసులు పెట్టిస్తానని, అసాంఘిక శక్తులతో సంబంధాలున్నాయని వేధించాడు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని కోరగా ప్రతి ఉద్యోగి 10 లక్షలు కట్టాలని బెదిరించాడు. దీనితో బాధిత ఉద్యోగులంతా పోలీసులను ఆశ్రయించారు.  

రూ.200 కోట్లకుపైగా వసూలు 
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాల పేరుతో 1,780 మంది నుంచి రూ.లక్ష నుంచి ఆపై మొత్తం లో వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. రైతులకు రుణాలు, ఇతర వ్యవసాయ సంబంధిత స్కీంల పేరుతో భారీగానే వసూలు చేసినట్టు ఆ ఉద్యోగులు వెల్లడించారు. ఇలా మొత్తంగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వసూలు చేసి ఉంటాడని పోలీస్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డబ్బుతో పక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. వాటిని స్వాధీనం చేసుకుంటేగానీ బాధితులకు న్యాయం చేయలేమని పోలీసులు అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సీఐడీకి బదిలీ చేసి విచారణ పక్కాగా జరిగేలా చూడాలని దర్యాప్తు అధికారులైన పలువురు సీఐలు, ఎస్‌ఐలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఎస్పీలు, కమిషనర్లు సీఐడీకి లేఖలు రాసినా పట్టించుకోవడంలేదు. స్కామ్‌ సొమ్ముతో కొనుగోలు చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలంటే హైదరాబాద్‌ సీసీఎస్‌తోపాటు సీఐడీకి మాత్రమే అధికారాలున్నాయి.    

మరిన్ని వార్తలు