కొంత ఫోర్టిఫైడ్‌ రైస్‌ తీసుకోండి

28 Apr, 2022 08:56 IST|Sakshi

కేంద్రాన్ని కోరిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ

పరిశీలిస్తామన్న కేంద్రం 

గత యాసంగి సీఎమ్మార్‌ గడువు పెంపుపై స్పష్టత కరువు

సాక్షి, హైదరాబాద్‌: ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి కేంద్రం కోరిన విధంగా సీఎమ్మార్‌ కింద ముడిబియ్యంతో పాటు కొంత మేర బాయిల్డ్‌ ఫోర్టిఫైడ్‌ బియ్యం (పోషకాలు కలిపిన బలవర్ధక ఉప్పుడు బియ్యం) తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కోరింది. కేంద్రం ఎంత కావాలంటే అంత ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, అధికారులు మంగళవారం ఢిల్లీ వెళ్లి ఎఫ్‌సీఐ, కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది.

ఈ అంశాన్ని అధికారులు పరిశీలిస్తామన్నారని, స్పష్టమైన హామీ లభించలేదని సమాచారం. కాగా గత యాసంగికి సంబంధించిన సీఎంఆర్‌ గడువు పొడిగింపును మరో నెల పొడిగించాలన్న విజ్ఞప్తికీ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ దక్కలేదని తెలిసింది. గత యాసంగి సీజన్‌లో 5 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ రాష్ట్రం నుంచి తీసుకుంది.

ధాన్యం కొనుగోలుకు మార్గదర్శకాలు
ఈ యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోలుకు పౌరసర ఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు లంతా ఒకేసారి రాకుండా టోకెన్లు జారీ చేయాలని, డీఫాల్ట్‌ మిల్లర్లకు ఈ సీజన్లో ధాన్యం కేటాయిం చొద్దని నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా సరిహద్దుల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మిల్లుల్లో తనిఖీలు వాయిదా
ఈ నెల 28 నుంచి మిల్లుల్లో చేపట్టాల్సిన తనిఖీలను ఎఫ్‌సీఐ వాయిదా వేసింది. తనిఖీల వల్ల సీఎంఆర్‌కు ఆటంకం కలుగుతుందని పౌరసరఫరాల కమిషనర్‌ ఎఫ్‌సీఐకి లేఖ రాయగా తాత్కాలికంగా వాయిదా వేసింది. మే మొదటి వారంలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు