దవఖానాల్లో అగ్ని ప్రమాదాలపై సీఎం కేసీఆర్‌ అలర్ట్‌

25 Apr, 2021 03:15 IST|Sakshi

అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి

అన్ని ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకోవాలి

గాంధీ లాంటి ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫైర్‌ ఇంజిన్లు

అవసరమున్న ఆసుపత్రులకు ఆక్సిజన్‌ చేరేలా సమన్వయం చేసుకోవాలి

టెస్టింగ్‌ కిట్ల కొరత రావొద్దు

వైద్య, ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. వేసవి కాలం కావడం, అన్ని ఆసుపత్రులు కరోనా పేషెంట్లతో నిండి ఉన్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రి, టిమ్స్‌ లాంటి పేషెంట్లు ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫైర్‌ ఇంజిన్లు పెట్టాలని సూచించారు.

యుద్ధ విమానాలను ఉపయోగించి తీసుకువస్తున్న ఆక్సిజన్‌ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రికి చేరేవిధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరగడంతో పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య కూడా పెరిగిందని, దీంతో టెస్టింగ్‌ కిట్ల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రపంచంలో కిట్లు ఎక్కడ అందుబాటులో ఉన్నా మన రాష్ట్రానికి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. కిట్లు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల లేఖలో పేర్కొన్నారు.

ప్రతి పేషెంట్‌కు ఐసోలేషన్‌ కిట్‌ 
రాష్ట్రంలో కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌ అందించాలని సీఎం కేసీఆర్‌ వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ పర్యవేక్షించాలని సూచించారు. ఎన్ని లక్షల మందికైనా హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ అందించడానికి వీలుగా కిట్లను సమకూర్చాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా కరోనా నియంత్రణలో పూర్తి సహకారం అందిం చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు