హస్తినలో ముఖ్యమంత్రి 

21 May, 2022 01:34 IST|Sakshi
శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సీఎం కేసీఆర్‌ 

హస్తినలో ముఖ్యమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట పార్లమెంటు సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తదితరులు ఉన్నారు. వీరికి ఢిల్లీలోనే ఉన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు స్వాగతం పలికారు.

దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌ పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగం గా శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, జాతీయ మీడియా సంస్థలకు చెందిన ప్రముఖ జర్నలిస్టులతో భేటీ కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది కుటుంబాలను పరామర్శించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు.

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అర వింద్‌ కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌సింగ్‌ కూడా పాల్గొంటారు. అనంతరం రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఈ నెల 26న బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో, 27న మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్దిలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. షిర్డీ సాయిబాబా దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. తిరిగి ఈ నెల 29 లేదా 30న పశ్చిమ బెంగాల్, బిహార్‌ రాష్ట్రాల పర్యటనకు సీఎం వెళ్లే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు