Telangana Budget Deficit: బడ్జెట్‌ లోటు.. పూడ్చుకునేదెట్లా? ఏకంగా రూ.45 వేల కోట్ల లోటు

10 Aug, 2022 03:10 IST|Sakshi

రుణ సమీకరణ, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అంచనాల్లో తగ్గిపోతున్న రూ.45 వేల కోట్లు

ఈ నిధులను ఎలాసమీకరించుకోవాలన్న దానిపై ప్రభుత్వం దృష్టి..

అదనపు ఆదాయ వనరుల సమీకరణే ఎజెండాగా రేపు కేబినెట్‌ భేటీ

భూముల ప్రభుత్వ విలువలుమరోసారి పెంచడంపై పరిశీలన..

పన్నేతర ఆదాయంపై నజర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుత ఆదాయ వనరులను పెంచుకోవడంతోపాటు కొత్త, అదనపు ఆదాయ వనరుల అన్వేషణపై ఫోకస్‌ చేసింది. 2022–23 బడ్జెట్‌లో పెట్టుకున్న కేంద్ర పద్దులు, రుణ సేకరణ అంచనాల్లో ఏకంగా రూ.45 వేల కోట్ల లోటు ఏర్పడుతుండటంతో.. దానిని పూడ్చుకునేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ఆదాయ వనరుల సమీకరణతోపాటు పలు ఇతర అంశాలపై మిగతా 5వ పేజీలో చర్చ జరుగుతుందని సీఎంవో కార్యాలయ వర్గాలు ప్రకటించాయి.

ఆదాయ వ్యయాల లెక్కలు తేల్చి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాల లెక్కలను మంత్రివర్గ భేటీలో పరిశీలించనున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. రుణ సమీకరణలో కేంద్రం సహాయ నిరాకరణ, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద సాయంలో తెలంగాణ పట్ల వివక్షపై చర్చించే అవకాశం ఉందని వెల్లడించాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన సబ్‌కమిటీ సిఫార్సులను కేబినెట్‌ భేటీలో పరిశీలించి.. ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి.

రుణాలపై కేంద్ర నిర్ణయంతో..
కార్పొరేషన్ల పేరిట తీసుకునే రుణాలకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీని కూడా.. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కింద లెక్కగడతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనివల్ల ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిపై ప్రభావం పడుతుందని, రుణ అంచనాల్లో రూ.15 వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇక గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్ర సాయం అంచనాల్లో రూ.18 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతోందని అంచనా వేసింది. ఈ లెక్కన ఈసారి రూ.30 వేల కోట్ల మేర తక్కువగా రావొచ్చని లెక్కించింది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రూ.45 వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతోందని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచామంటున్నా.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, ఇతర పథకాలకు కోతలతో గతంలో కంటే తక్కువగా నిధులు వస్తున్నాయని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను భారీగా పెంచుతుండటం, రూ.లక్ష వరకు రుణమాఫీ, వరద నష్టం, ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్మాణ వ్యయం, రుణాల అసలు, వడ్డీ చెల్లింపుల వంటివాటికి నిధుల అవసరం భారీగా పెరగనుందని వివరిస్తున్నారు.

పన్నేతర ఆదాయంపై దృష్టి
రాష్ట్రంలో ఇసుక అమ్మకాలు, మైనింగ్‌ రాయల్టీ పెంపు, రాజీవ్‌ స్వగృహ ఇండ్లు, నిరుపయోగ భూముల అమ్మకాలు, ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు, పన్ను లీకేజీలను అరికట్టడం వంటి అంశాలపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. భూముల మార్కెట్‌ విలువలను మరోసారి పెంచే అవకాశాలనూ కేబినెట్‌ పరిశీలించే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో భూముల విలువలను సవరించినా.. చాలా ప్రాంతాల్లో అంచనా వేసుకున్నదానికన్నా తక్కువే పెరిగిందని, ఆయా ప్రాంతాల్లో మరోసారి భూముల విలువలను సవరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి.. ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా అదనపు నిధులను సమీకరించే మార్గాలను ప్రభుత్వం అనుసరించనుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఈ ఏడాదీ గ్రాంట్లు అంతంతే!
2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్‌ నెల గణాంకాలను మాత్రమే కాగ్‌ విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లో పెట్టుకున్న లక్ష్యంలో.. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కేవలం 6 శాతం, కేంద్ర పన్నుల్లో వాటా 5 శాతం మేర మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల కింద 48,724.12 కోట్లు సమీకరించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంకాగా.. ఇప్పటివరకు రూ.14,500 కోట్లను ఆర్‌బీఐ నుంచి బాండ్లను వేలం ద్వారా సమకూర్చుకుంది. మరో రూ.10 వేల కోట్ల రుణ వెసులుబాటుకు కేంద్రం అంగీకరించింది. లక్ష్యం మేరకు మరో రూ.25 వేల కోట్లవరకు బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలనే సేకరించాల్సి ఉంది. అయితే కార్పొరేషన్ల కింద తీసుకున్న రుణాల విషయం ఇంతవరకు తేలలేదు. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గకుంటే భారీగా నిధుల లోటు ఏర్పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపైనా..
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈనెల 21న నిర్వహించే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, స్థానిక సంస్థల సమావేశాలు, మునుగోడు ఉప ఎన్నిక, ఇతర అంశాలు కూడా కేబినెట్‌ భేటీలో చర్చకు రానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
చదవండి: నేతిబీరకాయలో నేతి లాంటిదే.. నీతి ఆయోగ్‌లోని నీతి: మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

మరిన్ని వార్తలు