President Election: దీదీ బాటా.. సొంత రూటా?.. కేసీఆర్‌ ఏం చేస్తారు?

12 Jun, 2022 02:33 IST|Sakshi

రాష్ట్రపతి ఎన్నికలో కేసీఆర్‌ ఏం చేస్తారనే దానిపై తీవ్ర చర్చ 

బీజేపీయేతర సీఎంలు, నేతలతో కూటమి దిశగా మమతా బెనర్జీ అడుగులు 

ఈ నెల 15న ఢిల్లీలో సమావేశానికి రావాలంటూ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం 

ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించే యోచనలో కేసీఆర్‌ 

అలాంటిది ఉమ్మడి అభ్యర్థికి మద్ధతిస్తే లాభనష్టాలేమిటనే ఆలోచన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టేందుకు పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సిద్ధమవడం.. ఆ దిశగా నిర్వహించే సమావేశానికి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించడం.. ఈ భేటీకి కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా పిలవడం.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దీనిపై సీఎం కేసీఆర్‌ ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం రావాలని, అందుకోసం విపక్షాలు ఏకంకావాలని కేసీఆర్‌ పలుమార్లు పిలుపునిచ్చారు. జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలతో సమావేశమై చర్చించారు. ఇలాంటి సమయంలో మమతా బెనర్జీ (దీదీ) ఆహ్వానంపై ఏం నిర్ణయం తీసుకుంటారు, ఆయన అడుగులు ఎటు అన్న చర్చ నడుస్తోంది.

ప్రత్యామ్నాయం కోసం ఇప్పటికే ప్రయత్నాలు 
కేంద్రంలో మోదీ ప్రభుత్వం, బీజేపీ పార్టీపై కొంతకాలంగా సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా దేశంలో కొత్త శక్తి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచే ఆ శక్తి ఉద్భవించబోతోందంటూ ప్రత్యామ్నాయం తానే అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర శక్తులపై దృష్టిపెట్టారు. తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, జార్ఖండ్, మహారాష్ట్ర సీఎంలతో.. పలు పార్టీల ముఖ్య నేతలతో సమావేశమై చర్చలు జరిపారు.

తాజాగా శుక్రవారం టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో భేటీ అయి.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు. ఈ నెల 19న రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఉన్నట్టుండి శనివారం బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఓ అడుగు ముందుకేసి.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలుపుదామని పిలుపునిచ్చారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 15న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతోపాటు విపక్షాల సీనియర్‌ నేతలు, సీఎంలను ఆహ్వానించడంతో ఉత్కంఠ మొదలైంది. 

ఏం చేయబోతున్నారు? 
ఇటీవల బెంగళూరులో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో చర్చించిన తర్వాత.. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారంటూ కేసీఆర్‌ ప్రకటన చేశారు. తర్వాత కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత శుక్రవారం ప్రగతిభవన్‌కు వచ్చి పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు. మరి ఇప్పుడు కేసీఆర్‌ ఏం చేయబోతున్నారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే దిశగా పావులు కదుపుతున్నారా? అందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారా? దేశవ్యాప్తంగా విపక్ష నేతలతో ఫోన్లలో సంభాషిస్తున్నారా? మళ్లీ బయటకు వచ్చి హడావుడి చేస్తారా? ఇంతటితోనే ఆగిపోతారా? అనే ప్రశ్నలు వినవస్తున్నాయి. దీదీ స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించిన నేపథ్యంలో ఢిల్లీ భేటీకి వెళ్లాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన హాజరుకాని పక్షంలో మంత్రి కేటీఆర్‌ను పంపించే అవకాశం ఉందని అంటున్నాయి. 

కాంగ్రెస్‌తో కలిస్తే ఓ తంటా.. లేకపోతే మరో తంటా! 
రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ, కాంగ్రెస్‌ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. మమతా బెనర్జీ ఆలోచనల తరహాలోనే విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. తమ అభ్యర్థి గెలుపు ఖాయమని బీజేపీ ధీమాగా ఉంది. ఈ పరిస్థితుల్లో ‘ఉమ్మడి అభ్యర్థి’ఎంపికపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రతిపక్షాలతో మంతనాలు ప్రారంభించారు.

శరద్‌ పవార్, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ థాక్రేలతో స్వయంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే ఇప్పటికే ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ను నేరుగా కలిసి చర్చించారు. త్వరలో ఉద్ధవ్‌ థాక్రేతోపాటు డీఎంకే, తృణమూల్, వామపక్షాల నాయకులను కలుస్తానని ప్రకటించారు. ప్రధాన పక్షాలు ఒక అవగాహనకు వస్తే.. మిగతా విపక్షాలు కూడా తమ వైఖరి నిర్ణయించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది.

అయితే కాంగ్రెస్‌తో కలిసి ఉమ్మడి అభ్యర్థికి టీఆర్‌ఎస్‌ మద్ధతిస్తే.. రాష్ట్రంలో నష్టం కలగవచ్చనే ఆలోచన టీఆర్‌ఎస్‌ పెద్దల్లో ఉన్నట్టు సమాచారం. అలాగని విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతివ్వకపోతే.. కొంతకాలంగా బీజేపీపై చేస్తున్న పోరాటం ఉత్తదేనన్న విమర్శలు వస్తాయన్న భావన కూడా ఉన్నట్టు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు