ఆఖరి నిమిషంలోనే ‘పెద్దల’ పేర్లు..!

15 May, 2022 01:04 IST|Sakshi

నేరుగా టీఆర్‌ఎస్‌ అధినేత నుంచి సమాచారం 

3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్‌ కసరత్తు

ప్రతిపాదకుల జాబితాను సిద్ధం చేస్తున్న టీఆర్‌ఎస్‌ఎల్పీ

ఆరేళ్ల పదవీకాలం ఉండే ఆ రెండు సీట్లకే ఆశావహులు మొగ్గు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను చేపట్టింది. బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి నామినేషన్ల స్వీకరణ ఈ నెల 12 నుంచి 19 వరకు కొనసాగనుంది. వచ్చే నెల 21న రాజ్యసభ సభ్యులుగా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ స్థానాల్లో కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజకీయ, సామాజికవర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేస్తున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. రాజ్యసభ ఉపఎన్నిక స్థానంలో పోటీ చేసే అభ్యర్థిని ఈ నెల 17 లేదా 18న, మరో రెండు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈ నెల 25న ప్రకటించే అవకాశముంది.

అయితే అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకుండా, ఎంపికైనవారికే నేరుగా సమాచారం అందిస్తామని ఆశావహ నేతలకు కేసీఆర్‌ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవలి శాసనమండలి ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల ఎంపికలోనూ గోప్యత పాటించి చివరి నిమిషంలో అభ్యర్థులకు సమాచారం అందించారు. అదే వ్యూహాన్ని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ పాటించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ స్థానాలకు వివిధ రంగాల ప్రముఖులు కూడా టీఆర్‌ఎస్‌ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు.  

ప్రతిపాదకుల జాబితాలు సిద్ధం 
రాజ్యసభ అభ్యర్థి గరిష్టంగా 4 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కో నామినేషన్‌ సెట్‌పై తప్పనిసరిగా పదిమంది ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా సంతకాలు చేయాలి. అభ్యర్థుల ఎంపికపై ఓ వైపు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తుండగా ప్రతిపాదకుల జాబితాను పార్టీ శాసనసభాపక్షం కార్యాలయం ద్వారా సిద్ధం చేసి నామినేషన్‌ సెట్లపై పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఒక్కో అభ్యర్థి తరఫున కనీసం 3 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు టీఆర్‌ఎస్‌ సన్నాహాలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయడంలో పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ భాగస్వాములు చేస్తున్నారు. రాజ్యసభ ఉపఎన్నిక స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి 2024 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయాలి.

కొత్తగా ఎన్నికయ్యే మరో ఇద్దరు సభ్యుల పదవీకాలం 2028 జూన్‌లో ముగుస్తుంది. ఆరేళ్ల పదవీ కాలపరిమితి ఉన్న స్థానాల నుంచే తమను ఎంపిక చేయాలని ఆశావహులు కోరుతున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ మాజీ ఎంపీ ఇదే వి షయాన్ని కేటీఆర్‌కు విన్నవించినట్లు సమాచారం.    

మరిన్ని వార్తలు