‘కేంద్రం’ కొనదట..కొనుగోలు కేంద్రాలుండవ్‌

30 Nov, 2021 06:09 IST|Sakshi

మెడపై కత్తి పెట్టి రాయించుకున్నరు.. 
కేంద్రం గత యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం మెడమీద కత్తిపెట్టి భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం ఇవ్వబోమంటూ అండర్‌టేకింగ్‌ తీసుకుంది. అధికారులు ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో రాసిచ్చారు. యాసంగిలో రాష్ట్రంలో ధాన్యం నూక ఎక్కువ అవుతుంది. దాంతో గతంలో పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లులను ప్రోత్సహించిది ఎఫ్‌సీఐనే. 

ఇక పార్లమెంట్‌లో పోరాటమే.. 
ఇక పార్లమెంటులో అన్ని అంశాల మీద కొట్లాడుతాం. విద్యుత్‌ చట్టం, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రతీరోజూ నిలదీస్తాం. రైతు ఉద్యమంలో మరణించిన 750 మందికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని వెంటనే తేవాలని డిమాండ్‌ చేస్తాం. 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఒక్క గింజ ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం కరాఖండీగా చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సేకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. రైతులు ఆగం కావద్దనే ధైర్యంగా చెప్తున్నాం. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. ప్రభుత్వం కొంటదన్న ఉద్దేశంతో యాసంగిలో రైతులెవరూ వరిసాగు చేయవద్దు. వరి ధాన్యం కొనుగోలు కోసం నేను పేగులు తెగేదాక కొట్లాడిన. నేను నాలుగు సార్లు.. అధికారులు 15 సార్లు.. మంత్రులు, ఎంపీలు ఆరుసార్లు వెళ్లినా కేంద్రం స్పందింలేదు. విమానం ఖర్చులు దండగయ్యాయి. కేంద్రం హామీ ఇవ్వకున్నా వానాకాలంలో పండిన ధాన్యం ఎంతైనా, ఎంత వచ్చినా కొనుగోలు చేస్తం’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేశంలో ఆహార ధాన్యాలను సేకరించి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన 750 మందికి రూ.27.50 కోట్ల పరిహారాన్ని కేబినెట్‌ మంజూరు చేసిందని తెలిపారు. బాధిత రైతు కుటుంబాలకు స్వయంగా తానుగానీ, మంత్రులు వెళ్లిగానీ పరిహారాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

కేంద్రానిది దిక్కుమాలినతనం 
‘‘ఎఫ్‌సీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించి కేంద్రానికి అప్పగిస్తుంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ అంశంలో రాద్ధాంతం చేసి దేశ రైతాంగాన్ని గందరగోళ పరుస్తోంది. 140 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించే కేంద్రం చిల్లరకొట్టు సావుకారిలా, కిరాణా కొట్టు వారిలా లాభనష్టాలు బేరీజు వేసుకుని మాట్లాడటం ఔన్నత్యం కాదు. దేశంలో ఆహార భద్రత కల్పించాల్సిన సామాజిక బాధ్యత కేంద్రానిదే. ధాన్యం నిల్వ చేయడంలో సమస్యలుంటే ప్రత్యామ్నాయం ఆలోచించే శక్తి కేంద్రానికి ఉంటుంది. కాబట్టి అవసరమైతే లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చినా భరించాలి. కానీ కేంద్రం బాధ్యత నుంచి తప్పుకుని రాష్ట్రాలపై నెపాన్ని నెట్టడం దిక్కుమాలినతనం, దరిద్రపు గొట్టు ప్రయత్నం. ఇంత నీచంగా, దిగజారి పచ్చి అబద్ధాలు చెప్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్న కేంద్రాన్ని ఎప్పుడూ చూడలేదు. 

వానాకాలం పంటకూ స్పష్టత ఇయ్యలే.. 
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్, నీటి తీరువా రద్దుతో సాగు విస్తీర్ణం బాగా పెరిగి వ్యవసాయ విస్తరణ జరిగి పంటల దిగుబడి పెరిగింది. కాంగ్రెస్‌ హయాంలో 49.25 లక్షల ఎకరాల్లోనే జరిగిన వరిసాగు విస్తీర్ణం ప్రస్తుతం 1.04 కోట్ల ఎకరాలకు చేరింది. 2013–14 వరకు ఏటా సగటున 10.09 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే.. తెలంగాణ వచ్చాక ఏటా సగటున 69.38 లక్షల టన్నులు సేకరిస్తున్నం. తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం తెలుసుకోలేక, నిర్వహణ సామర్థ్యం, తెలివితేటలు లేక దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. పచ్చి బియ్యం ఏటా ఎంత తీసుకుంటారో కోటా ఇవ్వాలని నేను, మంత్రులు, అధికారులు అడిగినా స్పష్టత ఇవ్వలేదు. వానాకాలంలో 90లక్షల టన్నులు తీసుకోవాలని కోరితే.. 40 లక్షల టన్నులే తీసుకుంటామన్నారు. 

రాష్ట్రాలపై పెత్తనం చేసే యత్నం 
రైతులు, మధ్య తరగతి ప్రజల ఉసురుపోసుకునే మరో దుర్మార్గపు విద్యుత్‌ చట్టాన్ని కేంద్రం తెస్తోంది. రైతుల మెడమీద కత్తిపెట్టి బోరుబావుల వద్ద మీటర్లు పెట్టాలని లేఖ రాసింది. రాష్ట్రాల హక్కులను హరించి పెత్తనం చేసే ప్రయత్నం చేస్తోంది. మీరు పాలించే రాష్ట్రాల్లో సంస్కరణలు పెట్టుకోండి. మేం కరెంటు బిల్లును వ్యతిరేకిస్తాం.

ఒకటో రెండో సీట్లు పోతే పెద్ద విషయమా? 
సందర్భం వచ్చినపుడు రాజకీయం సంగతి చూద్దాం. ఆడోటి ఈడోటీ గెలవంగనే ఆగమై దుంకుతున్నరు. మొన్న కేసీఆర్‌ దెబ్బకు ముషీరాబాద్‌లో కిషన్‌రెడ్డి ఓడిపోయాడు కదా. అంత అహంకారం ఎందుకు? గెలుపోటములు సహజం కదా.. ఇన్ని ఎమ్మెల్సీలు ఎన్నికలు జరుగుతుంటే మీ బతుక్కు ఎక్కడైనా ఒక్కటి ఉందా? 13 మేమే గెలిచాం. మిగిలిన ఆరూ మేమే గెలుస్తం.  

మరిన్ని వార్తలు