సీఎం కేసీఆర్‌ పంటికి శస్త్రచికిత్స

5 Apr, 2022 05:04 IST|Sakshi

రెండ్రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పంటికి సోమవారం శస్త్రచికిత్స జరిగింది. కొద్దిరోజులుగా తీవ్ర పంటినొప్పితో సతమతమవుతున్న కేసీఆర్‌ పరీక్షల నిమిత్తం ఆదివారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ వైద్యుడికి సంబంధించిన ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు.

అనంతరం కేసీఆర్‌కు శస్త్రచికిత్స చేసి ఓ పంటిని తొలగించినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. శస్త్రచికిత్స నిమిత్తం అనస్తీషియా సైతం ఇవ్వడంతో కేసీఆర్‌ రోజంతా విశ్రాంతిలోనే గడిపారు. మరో రెండ్రోజులపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా చెబుతున్నారు. తుగ్లక్‌రోడ్డులోని కేసీఆర్‌ నివాసానికి పలువురు ఎంపీలు మధ్యాహ్నం వెళ్లినప్పటికీ ఆయన విశ్రాంతిలో ఉండటంతో కలవలేక కేవలం భోజనం చేసి వెళ్లిపోయారు.   

బాబూ జగ్జీవన్‌ రామ్‌కు సీఎం కేసీఆర్‌ నివాళి 
సాక్షి, హైదరాబాద్‌: భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగుబలహీన వర్గాల నేత, డా.బాబూ జగ్జీవన్‌ రామ్‌ 115వ జయంతిని పురస్కరించుకుని, ఆయన దేశానికి చేసిన సేవలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్మరించుకున్నారు. ఏప్రిల్‌ 5న ఆయన జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌కు ఘనంగా నివాళులర్పించారు.

దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన నేత బాబూ జగజ్జీవన్‌ రామ్‌ అని, ఆయన ఆశయాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. 

మరిన్ని వార్తలు