దిగ్గజ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం.. లక్ష మందికి ఉద్యోగాలు..!

2 Mar, 2023 17:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’( Hon Hai Fox Conn)సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ ( Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి  రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందం ద్వారా హోన్ హై ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక  లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి లభించనుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైంది.  ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించింది.

యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో స్వదస్తూరితో  ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సిఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ లీకి అందచేశారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం అనంతరం ప్రగతి భవన్ లో యంగ్ ల్యూ ప్రతినిధి బృంధానికి మధ్యాహ్న భోజనంతో సీఎం కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌,  వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

మరిన్ని వార్తలు