సచివాలయ పనుల్లో జాప్యం వద్దు: కేసీఆర్‌

18 Aug, 2022 00:16 IST|Sakshi
కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన వివిధ రకాల డిజైన్లను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌. 

నిర్మాణ పనుల పరిశీలన.. అక్కడే సమీక్ష

అధికారులకు పలు సూచనలు

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయ పనుల్లో ఎట్టి పరిస్థి తుల్లో జాప్యం జరగొద్దని, ఏకకాలంలో అన్ని విభాగాల పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని   సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వేగంగా పనులు జరుపుతూనే నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు. సీఎం బుధవారం సాయంత్రం సచివాలయ పనులను పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు సూచ నలు చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కలియదిరి గారు.

నిర్దేశించిన డిజైన్లలో రూపొందుతున్నాయా లేదా తనిఖీ చేశారు. శ్లాబులు, భవనంపై గుమ్మటాల నిర్మాణం, ఇంటీరియర్‌ పనులు, ఫర్నిచర్‌ ఎంపిక తదితరాలపై పలు సూచనలు చేశారు. భవనం మధ్య ఉండే కోర్టుయార్డు, ముందు భాగంలోని ల్యాండ్‌ స్కేప్, ఇతర పచ్చిక బయళ్లను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. రాజస్తాన్‌ నుంచి తెప్పించిన ధోల్పూర్‌ ఎర్రరాయి ఏర్పాటు, మురుగునీటి పారుదల వ్యవస్థ, సందర్శకులు వేచిచూసే ప్రాంతం, గోడ వెంబడి మట్టి నింపే పనులు, పార్కింగ్‌ ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎక్కడా, ఎవరికీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నాణ్యమైన ఫర్నిచర్‌ను ఎంపిక చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ దామోదర్‌రావు, పలువురు ప్రజాప్రతి నిధులు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుధాకర్‌తేజ, నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు