కీలక ప్రకటన.. కేసీఆర్‌ ఏం చెప్పబోతున్నారు?

8 Mar, 2022 18:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో బుధవారం తాను ఓ కీలక ప్రకటన చేయబోతున్నానని.. నిరుద్యోగులంతా ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలంటూ సీఎం కేసీఆర్‌ చెప్పడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు ఆయన అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడనున్న సందర్భంగా నిరుద్యోగులకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ప్రకటించబోతున్నారా? నిరుద్యోగ భృతి ప్రకటిస్తారా?. కేసీఆర్‌ మనసులో ఏముంది? ఆయన ఏం ప్రకటన చేయబోతున్నారనే దానిపై నిరుద్యోగులతో పాటు తెలంగాణ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఏవిధంగా తెలంగాణ ఆవిష్కారమైందో కూడా రేపు అసెంబ్లీలో చెప్పబోతున్నట్లు నేడు వనపర్తిలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్‌ పేరొన్న సంగతి తెలిసిందే.

చదవండి: రేపు కీలక ప్రకటన.. 10 గంటలకు టీవీ చూడండి: సీఎం కేసీఆర్‌

భారీ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయో గణాంకాలతో సహా కేసీఆర్‌ వివరించనున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదనే అపవాది ఉంది. ప్రభుత్వ శాఖలో దాదాపు 90 వేల ఖాళీలు ఉన్నాయని.. వాటిని భర్తీ చేయడంలేదని ప్రభుత్వంపై  ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనికి సమాధానంగా భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలలో కలిపి 70 వేల పైగా ఖాళీలు ఉన్నాయి. పోలీస్, హెల్త్ శాఖలు, మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్‌బీ శాఖలలో ఉద్యోగాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు