హమ్మయ్య.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఉపశమనం

30 Dec, 2020 00:48 IST|Sakshi

పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు

గతంలో రిజిస్టర్‌ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు మాత్రమే వర్తింపు

కొత్త ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయాలంటే లే–అవుట్‌ అనుమతి తప్పనిసరి

దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు 

పెళ్లిళ్లు, పైచదువులు, వైద్యానికి డబ్బుల్లేక ప్రజల అవస్థలు 

ఎట్టకేలకు తొలగిన సామాన్య ప్రజల ఇబ్బందులు 

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిళ్లు 

ప్లాట్ల యజమానులకు ఉపశమనం ఎల్‌ఆర్‌ఎస్‌ ఊరట
సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌ఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండానే రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రిజిస్టర్‌ అయిన ప్లాట్లు, నిర్మాణాలు పూర్తయిన వాటికి రిజిస్ట్రేషన్లను గతంలో మాదిరిగా ప్రారంభించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వి.శేషాద్రి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, డెవలపర్లు మొదటిసారి అమ్మే క్రమంలో కొత్తగా రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్లాట్లకు మాత్రం సంబంధిత అనుమతులు ఉండాలని లేదా ఆ ప్లాటు అనుమతి పొందిన లే–అవుట్‌లో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అలాగే గతంలో ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్, బీపీఎస్‌ల ద్వారా అనుమతులు పొందిన లే–అవుట్లు, ప్లాట్లు, భవనాలు, నిర్మాణాల విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని తెలిపారు. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు ఉత్తర్వుల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేస్తున్నామని, రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్లు ఈ ఆదేశాలను అమలు చేయాలని ఉత్తర్వుల్లో శేషాద్రి పేర్కొన్నారు. 

ఎల్‌ఆర్‌ఎస్‌పై సర్కారు నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు తొలగిన అడ్డంకి
సాక్షి, హైదరాబాద్‌: ఇళ్లో, పొలమో, ప్లాటో, ఇతర ఆస్తులో అమ్ముకోనిదే ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు, పిల్లల ఉన్నత చదువులు, భారీ వైద్య ఖర్చులు సామాన్యులకు సాధ్యంకాదు. అలాంటిది మూడున్నర నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు లే–అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)తో ముడిపెట్టడం దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. గత సెప్టెంబర్‌ 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నెల 21 నుంచి పాత విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించినా ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన ఇబ్బందిగా మారింది.

ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం కనీసం ఒకసారి రిజిస్ట్రేషన్‌ జరిగిన అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోవడం సామాన్యులకు భారీ ఉపశమనం కల్పించినట్లు అయింది. మరోవైపు అనధికార ప్లాట్ల కొనుగోళ్లకు అడ్వాన్సులు చెల్లించిన కొనుగోలుదారులకు సైతం ఊరట లభించింది. అనధికార ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించుకోకుంటే.. రిజిస్ట్రేషన్లు జరపమని గత ఆగస్టు 31న జారీ చేసిన జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

సామాన్యుల గురించి ఆలోచించాలి... 
ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల విషయంలో సైతం పునరాలోచన చేయాలని ప్రభుత్వంపై పలు వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఫీజులు అసాధారణంగా ఉన్నాయని, సామాన్యుల కోణం నుంచి చూసి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులను తగ్గించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎప్పుడో ఏళ్ల కింద కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు రూ.లక్షలు చెల్లించడం ఇబ్బందికరమేనని స్థిరాస్తి వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరి చేస్తూ ఆగస్టు 31న ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ జీవో 131ను తీసుకురాగా, గత అక్టోబర్‌ 31తో గడువు ముగిసింది. మొత్తం 25.59 లక్షల దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలను ఇంకా రూపకల్పన చేయలేదు. దీంతో వీటిని పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించడం సాధ్యం కావడం లేదు.

జీవోలోని నిబంధనల ప్రకారం.. జనవరి 31లోగా దరఖాస్తుదారులు మొత్తం క్రమబద్ధీకరణ ఫీజులు చెల్లించాలి. దీనికి నెల రోజుల వ్యవధి మాత్రమే ఉన్నా ఇప్పటివరకు వారికి ఫీజుల వివరాల లేఖలు అందలేదు. దరఖాస్తుదారుల్లో అత్యధికులు ఇటీవల కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారేనని, దీంతో వారు 10 శాతం ఖాళీ స్థలం లేని కారణంగా 14 శాతం ప్లాటు ధరను ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా చెల్లించాల్సి ఉంటుందని, ఇది పెనుభారంగా మారనుందని దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.  

►ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలి. ఇది ప్రజలకు వ్యతిరేకం. ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోలోని నిబంధనల ప్రకారం ఇళ్లను కట్టుకున్న ప్లాట్లను సైతం క్రమబద్ధీకరించుకోవాల్సిందే. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు 10 శాతం ఖాళీ స్థలం లేదన్న కారణంతో 14 శాతం ప్లాటు ధరను ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా చెల్లించాలన్న నిబంధన సరైనది కాదు. 
ప్రవీణ్, తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

►సదుద్దేశంతోనే ప్రభుత్వం ధరణి, ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చింది. అమలులో లోపాల వల్లే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయి. సామాన్యుల కోణం నుంచి చూసి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి. రిజిస్ట్రేషన్లను మూడున్నర నెలల పాటు నిలుపుదల చేయడంతో నగదు చేతులు మారక(క్యాష్‌ ఫ్లో) తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. జీతాలు చెల్లించడం, నిర్మాణ పనులు కొనసాగించడం, బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించడం కష్టమైంది.  
ట్రెడా, క్రెడా సంస్థల ముఖ్యులు    

మరిన్ని వార్తలు