బెంగళూరుకు కేసీఆర్‌..మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ

26 May, 2022 04:00 IST|Sakshi

మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అనంతరం తిరుగుపయనం 

సాయంత్రం హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కూతురు వివాహానికి హాజరు 

27న రాలేగావ్‌ సిద్ధి, అటు నుంచి షిర్డీకి

సాక్షి, హైదరాబాద్‌: జాతీయస్థాయిలో పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ గురువారం కర్ణాటకకు ఒకరోజు పర్యటన కోసం వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి బెంగుళూరుకు వెళ్తారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ భేటీ అవుతారు. పలు అంశాలపై వీరు చర్చించనున్నారు. ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దేవెగౌడతో చర్చిస్తారు.

రాష్ట్రాల్లో బలం లేకపోయినా ఇతర పార్టీల సభ్యులను లోబర్చుకుని బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం వంటి అనైతిక కార్యకలాపాల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్‌ బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు దేవెగౌడ నివాస ప్రాంతంలో భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు. దేవెగౌడ, కుమారస్వామితో రాజకీయ చర్చల అనంతరం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కూతురు వివాహానికి హాజరవుతారు. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ కోసం శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధికి  హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్తారు. హజారేతో భేటీ అనంతరం షిర్డీలో సాయిబాబా దర్శనం చేసుకుంటారు. కేసీఆర్‌ ఈ నెలాఖరులో బిహార్, పశ్చిమ బెంగాల్లోనూ పర్యటించనుండగా.. ఇంకా షెడ్యూల్‌ ఖరారు కావాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు