గవర్నర్‌ తేనేటి విందుకు సీఎం గైర్హాజరు 

16 Aug, 2022 01:46 IST|Sakshi

అరగంట వేచి చూసిన గవర్నర్, హైకోర్టు సీజే 

సీఎంఓ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో కార్యక్రమం ప్రారంభం 

గవర్నర్, సీఎం మధ్య నిర్మాణాత్మక సంబంధాలుండాలన్న తమిళి సై  

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌ ప్రాంగణంలో నిర్వహించిన తేనేటి విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు గైర్హాజరయ్యారు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తొలుత సమాచారం అందినా, చివరి నిమిషంలో రద్దు అయినట్టు తెలుస్తోంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేనేటి విందు ముగిసిన తర్వాత గవర్నర్‌ విలేకరులతో మాట్లాడారు. 

వస్తారని కబురు అందింది 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి తాను స్వయంగా లేఖలు పంపి వ్యక్తిగతంగా ఆహ్వానించినట్టు తమిళిసై తెలిపారు. సీఎం కేసీఆర్‌ సాయంత్రం 6:55కు రాజ్‌భవన్‌కు చేరుకుంటారని సీఎంఓ నుంచి తమకు కబురు అందిందని చెప్పారు. తాను పుదుచ్చేరి నుంచి బయలుదేరి 6 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నట్టు తెలిపారు. తనతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం సీఎం కేసీఆర్‌ కోసం నిరీక్షించినట్లు తెలిపారు.

సీఎం రాకపోవడం, దురదృష్టశాత్తూ ఆయన కార్యాలయం నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో దాదాపు అర్ధగంట పాటు వేచి చూసి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గవర్నర్, సీఎం మధ్య నిర్మాణాత్మక సంబంధాలుండాలని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యల పరిష్కారానికి ఇన్‌చార్జి వీసీ చర్యలు తీసుకుంటున్నారని గవర్నర్‌ చెప్పారు. 

అతిథులందరికీ పలకరింపు 
గవర్నర్‌ నిర్వహించిన తేనేటి విందు (ఎట్‌ హోం) కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రముఖ వ్యక్తులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, డాక్టర్లు, ఇంజనీర్లు, స్వచ్ఛంద సేవకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కాగా గవర్నర్‌ అతిథులందరి వద్దకు వెళ్లి పలకరించారు. బీజేపీ ఎంపీ డి.అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్సీ అమీనుల్‌ జాఫ్రీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. కరోనా సోకడంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, పాదయాత్రలో ఉండడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరుకాలేదు. ‘కనెక్ట్‌ ది చానల్సర్‌’కార్యక్రమం కింద వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన 75 మంది విద్యార్థులకు  గవర్నర్‌ పురస్కారాలు ప్రదానం చేశారు.   

మరిన్ని వార్తలు