అద్భుతంగా ఉండాలి 

20 Apr, 2022 01:26 IST|Sakshi
మంగళవారం సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌

కొత్త సచివాలయంపై అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం  

పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: దసరా నాటికి కొత్త సచివాలయం ప్రారంభించేందుకు వీలుగా పనులు చేపడుతున్నట్లు రోడ్లు భవనాల శాఖ యంత్రాంగం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చింది. ప్రధాన నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చిందని, అంతర్గత పనులు, భవనంపైన డోమ్‌ ఏర్పాటు పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆయనకు తెలిపారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.

కొత్త సచివాలయ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆయన వారిని ఆదేశించారు. అంతస్తులవారీగా పనులు ఎక్కడివరకు వచ్చాయని, ఎప్పటిలోగా పూర్తవుతాయని వారిని ప్రశ్నించారు. అన్ని పనులు అక్టోబర్‌ నాటికి పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ గడువుపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు చేయకున్నా, దసరా నాటికి భవనాన్ని సిద్ధం చేసే అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. మంత్రుల చాంబర్లు, సమావేశ హాలు, అధికారులు, సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు.

రాజస్థాన్‌ నుంచి ధోల్పూర్‌ ఎర్ర రాయి సరఫరా ఎలా ఉందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్, ఎమ్మెల్యే జోగు రామన్న, ఉన్నతాధికారులు రాజీవ్‌ శర్మ, సోమేశ్‌కుమార్, స్మితాసబర్వాల్, శేషాద్రి, రాహుల్‌ బొజ్జా, ప్రియాంక వర్గీస్, గణపతిరెడ్డి, హైదరాబాద్‌ సీపీ ఆనంద్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.  


నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనం   

మరిన్ని వార్తలు