సుపరిపాలనను ప్రతిబింబించాలి

8 Aug, 2021 04:18 IST|Sakshi
కొత్త సచివాలయం ప్లాన్‌ను పరిశీలిస్తున్న కేసీఆర్‌,

అద్భుతంగా కొత్త సచివాలయం 

గడువులోగా సిద్ధం చేయాలి 

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు 

నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి 

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం సుపరిపాలనకు తగ్గట్టుగా ఉండాలని.. పరిశుభ్రంగా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వరద నీటి, డ్రైనేజీ వ్యవస్థలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ముందుగా విధించుకున్న గడువులోగా మొత్తం పనులు పూర్తిచేసి, సచివాలయ భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. శనివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ కొత్త సచివాలయం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. కాంక్రీట్‌ నిర్మాణ పనులు పూర్తయ్యేలోగానే.. తర్వాత అవసరం పడే దర్వాజాలు, కిటికీలు, ఫర్నిచర్, విద్యుత్, ప్లంబింగ్, టైల్స్‌ వంటి సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు.

దీనివల్ల జాప్యాన్ని నివారించవచ్చని చెప్పారు. సచివాలయ ముఖద్వారం, బయటి గేటు పనులు, వాటికి అమర్చాల్సిన గ్రిల్స్‌ తదితరాలకు సంబంధించి కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. మంత్రులు, సీఎస్‌ సహా ఇతర అధికారుల కార్యాలయాలు ఉండే ఏరియాలు, విదేశీ ప్రతినిధులు, ప్రముఖుల కోసం నిర్మిస్తున్న వెయిటింగ్‌ హాల్‌ పనులను తనిఖీ చేశారు. పార్కింగ్, హెలిప్యాడ్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ఏర్పాటు చేసే వసతులపై ప్రశ్నించారు. బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో పైఅంతస్తుల పనులపై కచ్చితమైన ప్రణాళిక, వర్క్‌చార్టు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

అన్ని హంగులతో.. 
ప్రజల వద్దకే పాలన ఫలాలు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగా అన్ని హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక పాలన సాగుతోందని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ అద్భుత పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా సుపరిపాలన సాగుతున్న క్రమంలో అందుకు తగ్గట్టు సచివాలయ భవనాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నామన్నారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంతరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రేగా కాంతారావు, అంజయ్య యాదవ్, కృష్ణమోహన్‌రెడ్డి, హన్మంత్‌ షిండే, రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు