Telangana: అడవే ఉండాలి.. ఆక్రమణ ఉండొద్దు! 

10 Oct, 2021 01:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల మూడో వారం నుంచి కార్యాచరణ చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ‘భవిష్యత్తులో అంతా అడవే ఉండాలని, లోపల ఎవరూ ఉండటానికి వీల్లేదు (నన్‌ ఈజ్‌ ఇన్‌ సైడ్‌. ఇన్‌సైడ్‌ ఈజ్‌ ఓన్లీ ఫారెస్ట్‌)’ అని స్పష్టం చేశారు. అడవుల మధ్యలో పోడు చేస్తున్నవారిని గుర్తించి అంచులకు తరలిస్తామని.. అక్కడ భూమి ఇచ్చి, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. సాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని.. రైతుబంధు, రైతు బీమా కూడా వర్తింపజేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఒక్క గజం అటవీ భూమి అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ శనివారం పోడు భూముల అంశంపై ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పోడు సమస్య పరిష్కారంపై అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని, అవసరమైతే ఇతర పార్టీల నేతలను హెలికాప్టర్‌లో తీసుకెళ్లి అన్యాక్రాంతమైన భూములను చూపిస్తామని చెప్పారు. సమావేశంలో సీఎం కేసీఆర్‌ చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు ఆయన మాటల్లోనే.. 

నిర్లక్ష్యం వద్దు 
‘‘మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి. హరితహారంతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరితనిధికి విశేష స్పందన వస్తోంది. అడవులను రక్షించుకునే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ కనబర్చాలి. సమర్థవంతమైన అధికారులను నియమించాలి. వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. పోడు భూముల సమస్య పరిష్కారానికి అక్టోబర్‌ మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. 

బయటివారితోనే అసలు సమస్య 
గిరిజనుల సంస్కృతి అడవితో ముడిపడి ఉంటుంది. వారు అడవులకు హాని తలపెట్టరు. జీవనోపాధి కోసం అడవుల్లో దొరికే తేనె, బంక, కట్టెలు, ఇతర అటవీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించుకుంటారు. సమస్య అంతా బయటినుంచి వెళ్లి అటవీ భూములను ఆక్రమించి, చెట్లను నరికి, అటవీ సంపదను దుర్వినియోగం చేసేవారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం. పోడు సమస్య పరిష్కారమైన మరుక్షణమే అటవీభూముల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలను ప్రారంభిస్తాం. అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకోవడం అటవీశాఖ అధికారుల బాధ్యతే. 

మూడో వారంలో దరఖాస్తులు 
రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు సంబంధించి ఈ నెల మూడో వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలి. ఆ దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా.. వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్థారించాలి. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ చర్యలు చేపట్టాలి. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేయాలి. ఈ విషయంగా ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు తీసుకోవాలి. గిరిజన సంక్షేమశాఖతో సమన్వయం చేసుకుని అటవీ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలి. 

నవంబర్‌ నుంచి సర్వే.. 
రాష్ట్రంలో అటవీ భూముల సర్వేను నవంబర్‌ నుంచి ప్రారంభించనున్నాం. అక్షాంశ, రేఖాంశాల కో–ఆర్డినేట్స్‌ ఆధారంగా.. ప్రభుత్వ, అటవీ భూముల సరిహద్దులను గుర్తించాలి. అవసరమైన చోట కందకాలు తవ్వడం, కంచె వేయడం వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్‌ రక్షణ అందిస్తాం. అంతిమంగా అందరి లక్ష్యం ఆక్రమణలకు గురికాకుండా అడవులను పరిరక్షించుకునేదై ఉండాలి..’’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్‌ , భూపాల్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి, సీఎం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, పీసీసీఎఫ్‌ శోభ ఇతర అధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు