మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టం: సీఎం కేసీఆర్‌

26 Mar, 2021 14:13 IST|Sakshi

విద్యా సంస్థల మూసివేత తాత్కాలికమే

ఉస్మానియా ఆస్పత్రిపై త్వరలోనే నిర్ణయం

త్వరలోనే 57 ఏళ్ల వారికి పెన్షన్‌: సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా మరోమారు విజృంభిస్తోంది. కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు చోట్ల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో కూడా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం విద్యాసంస్థలను మూసి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో సారి లాక్‌డౌన్‌ విధిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదన్నారు. ద్రవ్యవినిమయ బిల్లుపై ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా సమయంలోను సంక్షేమం ఆగలేదు. రాష్ట్రంలో అప్పులు పెరగలేదు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం లేదు. ప్రతి దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. రిజర్వేషన్లు రాష్ట్రాలకే వదిలేయాలని కోరాం. త్వరలో 57ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్‌ ఇస్తాం’’ అన్నారు. 

‘‘స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉంది కాబట్టే మూసివేశాం. ఇది తాత్కాలికమే. నిన్న ఒక్కరోజే 70వేల కరోనా పరీక్షలు చేశాం. ఇప్పటి వరకు 10లక్షల మందికి పైగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ ఇ‍చ్చాం. గతేడాది లాక్‌డౌన్‌తో ఆర్ధికంగా నష్టపోయాం. ఇక మరోసారి తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలి. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. ఉస్మానియా ఆ‍స్పత్రిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. తాగునీటి సమస్యకు చెక్‌ పెట్టాం’’ అన్నారు.

చదవండి: ఇంటింటా ఫీవర్‌ టెస్ట్‌.. మినీ లాక్‌డౌన్‌

మరిన్ని వార్తలు