వర్షంలోనే సీఎం కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతి పూజలు

17 Jul, 2022 19:42 IST|Sakshi

సాక్షి, ములుగు/భద్రాద్రి కొత్తగూడెం: భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్‌.. ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దుచేసిన నేపథ్యంలో బాధిత ప్రజలకు చేరుకోవడానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు.


చదవండి: సీతక్కకు తప్పిన ప్రమాదం

ములుగు, ఏటూరు నాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని సీఎం పరిశీలించారు. భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి శాంతి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించిన సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు.

అశ్వాపురంలో వరద బాధితులు ఆందోళన
అశ్వాపురంలో వరద బాధితులు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. వరద బాధితులను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. అశ్వాపురం రహదారిపై వరద బాధితులు బైఠాయించారు.

>
మరిన్ని వార్తలు