అవసరమైతే కొండగట్టుకు రూ.వెయ్యి కోట్లు!

16 Feb, 2023 02:40 IST|Sakshi

ఆంజనేయుడి ప్రస్తావన వస్తే కొండగట్టు పేరే వినిపించాలి 

హనుమాన్‌ జయంతి అనగానే ఈ క్షేత్రం వైపే చూడాలి  

ఆగమ శాస్త్ర ప్రకారం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దాలి 

భక్తుల తాకిడిని తట్టుకునేలా సకల సౌకర్యాలూ కల్పించాలి 

అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష 

మహాకార్యం పూర్తయ్యేవరకు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటానని వెల్లడి 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ కొండగట్టు: కొండగట్టును ప్రపంచాన్నే ఆకర్షించే అతిపెద్ద హనుమాన్‌ క్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలని, అందుకోసం రూ.1,000 కోట్లు ఖర్చయినా ఫర్వాలేదని చెప్పారు. దేశంలో ఆంజనేయుడి పుణ్యక్షేత్రం ప్రస్తావన వస్తే కొండగట్టు పేరు వినిపించాలని, హనుమాన్‌ జయంతి అనగానే దేశం మొత్తం కొండగట్టు వైపు చూడాలని స్పష్టం చేశారు.

బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సీఎం సందర్శించారు. అనంతరం ఆలయాభివృద్ధిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆలయం కోసం రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఆలయం విస్తరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, కొత్త నిర్మాణాలు, భక్తులకు వసతులపై రెండు గంటలపాటు చర్చించారు. అనంతరం పలు కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.  

గర్భగుడిని ముట్టుకోవద్దు.. 
‘యాదాద్రి తరహాలో వైష్ణవ సంప్రదాయాల్ని పాటిస్తూ.. ప్రతి సూక్ష్మ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం ఉన్న గర్భగుడిని ఏమాత్రం ముట్టుకోకుండా మిగిలిన చోట్ల పునర్మిర్మాణాలు చేపట్టాలి. ఇందుకోసం పండితులు, వాస్తు నిపుణులు, ఆర్కిటెక్టులు సమన్వయంతో వ్యవహరించాలి. హనుమాన్‌ జయంతి, ఇతర రద్దీ రోజుల్లోనూ భక్తుల తాకిడిని తట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలి. 850 ఎకరాల్లో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలి. క్షేత్రాన్ని సందర్శించే భక్తుల వాహనాల కోసం 86 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలి..’అని చెప్పారు. 

మాల ధారణ, విరమణ సజావుగా సాగాలి 
‘కేవలం తెలంగాణ, పొరుగు రాష్ట్రాల భక్తులే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా మాల ధారణ, విరమణ సమయంలో లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. అందుకు అనుగుణంగా పుణ్యక్షేత్రంలో రవాణా సదుపాయాలు, అన్ని ప్రధాన ద్వారాలు విస్తరించాలి. భవిష్యత్తులోనూ పెరిగే భక్తుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు ఉండాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

సీఎం మరికొన్ని ఆదేశాలు  
– రెండు నెలల్లో వరద కాలువ నుంచి పైపుల ద్వారా కొండగట్టు పైకి నీటిని తరలించాలి. భక్తుల సౌకర్యాలకు సరిపోయేలా వసతి కల్పించాలి. (సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ఆదేశం) ఈ నీటితోనే నిర్మాణాలు కూడా చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి, పనులు వేగిరం చేయాలి. 
– విద్యుత్‌ సబ్‌ స్టేషన్, దవాఖానా, బస్టాండు, పార్కింగ్‌ స్థలం, రోడ్ల నిర్మాణం, పుష్కరిణి, వాటర్‌ ట్యంకులు, నీటి వసతి, కాటేజీల నిర్మాణం, దీక్షాపరుల మంటపం, పోలీస్‌ స్టేషన్, కళ్యాణ కట్ట తదితర మౌలిక వసతులను భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మించాలి.  
– గుడి అభివృద్ధికి అవసరమైన శిల్పులను సమకూర్చాలి. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు పడుతుంది. ఆ లోపు బాలాలయాన్ని నిర్మించాలి. 
– కొండగట్టు అంజన్న అభయారణ్య ప్రాంతాన్ని మైసూరు–ఊటీ రహదారిలో ఉన్న, నీలగిరి కొండల్లోని బండీపూర్‌ అభయారణ్యం మాదిరి మార్చాలి. (అటవీశాఖ అధికారి భూపాల్‌ రెడ్డికి ఆదేశం).  
– మొదట మూలవిరాట్టును దర్శించుకున్న తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని, గుట్ట కింద బేతాళ స్వామిని, రాములవారి పాదుకలను దర్శించుకునేలా సర్క్యూట్‌ను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలి. 
– క్షేత్రాన్ని సందర్శించే వీవీఐపీల కోసం యాదగిరిగుట్ట మాదిరి ప్రెసెడెన్షియల్‌ సూట్లు, వీవీఐపీ సూట్లు నిర్మించాలి. ఇందుకోసం స్థలాన్ని ఎంపిక చేసి, వాస్తు నియమాలను అనుసరించి నిర్మాణాలు చేపట్టాలి. 
– అంజనాద్రి పేరుతో వేద పాఠశాలను నిర్మించాలి. అందుకు తగిన స్థలం ఎంపిక చేయాలి.  

గుడి ఆదాయంపై ఆరా.. 
గుట్టలపై నుంచి సహజంగా ప్రవహించే ప్రవాహం (జలబుగ్గ) నుంచి నీటి లభ్యత గురించి, దాని అభివృద్ధి గురించి, గుట్ట సమీపంలోని చెరువులపై సీఎం ఆరా తీశారు. గుడికి వస్తున్న ఆదాయం గురించి కూడా ఆరా తీశారు. ప్రభుత్వానికి చేస్తున్న జమలో వ్యత్యాసంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహా కార్యం పూర్తయ్యే వరకు తాను వస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ దివకొండ దామోదర్‌ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, జీవన్‌ రెడ్డి, సంజయ్, కె.విద్యాసాగర్‌ రావు, కోరుకంటి చందర్, మండలి చీఫ్‌ విప్‌ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, కలెక్టర్‌ యాస్మిన్‌ భాషా, ఆలయ స్తపతి ఆనంద్‌ సాయి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, ఆలయ ఈఓ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

గుడికున్న గుర్తింపును దేశవ్యాప్తం చేయాలి..
‘కొండగట్టు అంటేనే ఆంజనేయుడి నిలయమన్న గుర్తింపు ఉంది. ఈ గుర్తింపును దేశవ్యాప్తం చేయాల్సిన సమయం వచ్చింది. అందుకే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించుకుని ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుదాం. ఇప్పుడు ఆలయాభివృద్ధికి కేటాయించిన రూ.100 కోట్లు చాలకపోతే.. రూ.వెయ్యి కోట్లయినా ఇస్తా. ఇంకా కావాలన్నా ఇస్తా. అయితే ఆగమశాస్త్ర ప్రకారం.. వాస్తు నియమాలను అనుసరించి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సకల సౌకర్యాలతో పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాలి. ఎక్కడ సౌకర్యాలు బాగుంటే అక్కడికి భక్తులు తప్పకుండా వస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలి..’అని కేసీఆర్‌ సూచించారు.

మరిన్ని వార్తలు