నేడు సర్కారు మేడిగడ్డ టూర్‌!

13 Feb, 2024 00:57 IST|Sakshi

సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల పర్యటన 

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెళ్లనున్న ప్రజాప్రతినిధులు 

ఉదయం 10.15కు బయలుదేరి.. మధ్యాహ్నం 3.30 గంటలకు చేరనున్న బృందం 

ప్రాజెక్టు పరిసరాల్లో ఏర్పాట్లు.. భారీగా బందోబస్తు 

కాళేశ్వరం ఆర్కిటెక్ట్‌ కేసీఆర్‌ మేడిగడ్డకు రావాలి: మంత్రి ఉత్తమ్‌ 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నేడు(మంగళవారం) కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ మేరకు సర్కారు ఏర్పాట్లు చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు లోపభూయిష్టమని.. ఈ విషయాన్ని చూపేందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళతామని నాలుగు రోజుల కింద సీఎం రేవంత్‌ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఉదయం 10.15 గంటలకు సీఎం రేవంత్‌తోపాటు మంత్రులు ఉత్తమ్, వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లనున్నారు. సీఎం, మంత్రులు వస్తున్న నేపథ్యంలో.. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సందర్శన తర్వాత సభ? 
సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటన సందర్భంగా మేడిగడ్డ వద్ద అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. బ్యారేజీని పరిశీలించేందుకు వీలుగా.. బ్యారేజీ దిగువన, గోదావరి తీరానికి వెళ్లే మార్గాలను సిద్ధం చేస్తున్నారు. వ్యూపాయింట్‌ ప్రాంగణం వద్ద 3 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణ లోపాలు, ఇతర అంశాలపై ఇక్కడ సభ నిర్వహించి, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. 

మేడిగడ్డ టూర్‌ షెడ్యూల్‌ ఇలా.. 
సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంగళవారం ఉదయం 10.15 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం మూడున్నర గంటల కల్లా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు బ్యారేజీని పరిశీలించి, నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడుతారు. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. 

కేసీఆర్‌ మేడిగడ్డకు రావాలి: ఉత్తమ్‌ 
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాత (ఆర్కిటెక్ట్‌) కేసీఆర్‌ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు రావాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులు, బోర్డుకు అప్పగింత అంశంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని (బీఆర్‌ఎస్‌ మద్దతుతో) ఆమోదించిన విషయాన్ని గమనించాలని కోరారు. సోమవారం అసెంబ్లీ వాయిదాపడ్డాక లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలవుతుందని.. మేడిగడ్డ పర్యటన నిమిత్తం సభను వాయిదా వేసి, బయలుదేరుతామని వివరించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు