మరో మూడు రోజులు చలి.. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది ఎక్కడో తెలుసా?

30 Jan, 2022 04:28 IST|Sakshi

అర్లీ(టీ)లో అత్యల్పంగా 4.9 డిగ్రీల నమోదు 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రాన్ని మళ్లీ చలి చుట్టేసింది. అన్ని ప్రాంతాల్లో సాధారణ సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల సెల్సియస్‌ మేర తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా అర్లీ(టీ)లో 4.9 డిగ్రీలుగా నమోదైంది. ఇంకా కుమరంభీంలో 5.8, సిర్పూర్‌ (యు)లో 5.8, గిన్నెధరిలో 6.0, సంగారెడ్డి జిల్లా న్యాలకల్‌లో 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జిల్లాలవారీగా చూస్తే పెద్దపల్లి, హన్మకొండ జిల్లాల్లో వీస్తోన్న ఈశాన్య గాలుల ఫలితంగా ఏకంగా 6 నుంచి 8 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజుల చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 30.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 

మరిన్ని వార్తలు