వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం

7 Sep, 2020 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను కలెక్టర్లు స్వాధీనం చేసుకునే పని వేగవంతంగా సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలంతా రెవెన్యూ రికార్డులను కలెక్టర్లకు అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సాగుతున్న కేసీఆర్‌ సర్కార్‌ వీఆర్వో వ్యవస్థ రద్దుకు యోచిస్తుంది. రాష్ట్రంలోని వీఆర్వోల వద్దనున్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులను స్వాధీనం చేసుకోవాలని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనం ఏ మేరకు పూర్తయిందో నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ అయినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. (తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!)

ఈ నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల వద్ద నుంచి రికార్డులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం వరకు 60 శాతం రెవెన్యూ రికార్డులు కలెక్టరేట్‌కు చేరాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, వీఆర్వోలు, వీఆర్ఏలు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయకుండా, స్వచ్ఛందంగా రెవెన్యూ రికార్డులను అప్పగిస్తున్నారని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ స్పష్టం చేశారు. 

కాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడంతో ఒకింత ఆందోళన, మరికొంత ఆనందం నెలకొంది.  వీఆర్వోలు, వీఆర్ఏలు బాధపడుతుండగా ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బాధతో వీఆర్ఏ, వీఆర్వోలు స్వాగతిస్తూనే తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు ఉద్యోగ భద్రత కల్పించాలని  కోరుతున్నారు. మాతృసంస్థ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నుంచి వేరే శాఖకు వెళ్లమంటే తమకు ఇబ్బందేనని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు