ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు..అంతా సెట్‌

30 Dec, 2021 03:06 IST|Sakshi

జనవరిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కేలండర్‌!

సెట్లన్నీ సకాలంలో పూర్తి చేస్తామని ఉన్నత విద్యా మండలి ధీమా 

సెట్‌ కన్వీనర్ల ఎంపికపై కసరత్తు 

డిమాండ్‌ లేని కోర్సులకు కత్తెర 

విద్యార్థులు చేరని కాలేజీలపై దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరానికి (2022–23) సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేయబోతున్నారు. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కసరత్తు చేపట్టింది. అన్ని యూనివర్సిటీల ఉప కులపతులతో మౌఖికంగా సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలిసింది. జనవరి 15లోగా వీసీలతో ఉత్తర ప్రత్యుత్తరాల ప్రక్రియను పూర్తి చేసి నెలాఖరు కల్లా షెడ్యూల్‌ను ప్రకటించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈసారి అన్ని సెట్స్‌ కూడా సకాలంలో నిర్వహించే వీలుందని విద్యా మండలి ధీమా వ్యక్తం చేస్తోంది.

వర్సిటీలకు జనవరిలో లేఖలు.. 
ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఏటా ఎంసెట్‌ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌), ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, ఎడ్‌సెట్, లాసెట్‌ ప్రధానంగా నిర్వహిస్తుంటారు. ఈసారి ఉమ్మడి పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష కూడా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఈపాటికే ఉమ్మడి పరీక్షల కేలండర్‌ను ప్రకటించాలి. కరోనా వల్ల ఈ ఏడాది పరీక్షల్లో జాప్యం జరిగింది. ఎంసెట్‌ ప్రక్రియ డిసెంబర్‌ మూడో వారం వరకూ సాగింది. ఎడ్‌సెట్, లాసెట్‌ సీట్ల కేటాయింపు ఇంకా కొనసాగుతోంది.

దీంతో కొత్త కేలండర్‌ విషయంలో ఉన్నతాధికారులు తర్జన భర్జన పడ్డారు. ఇటీవలి సమావేశంలో దీనిపై చర్చించి వీసీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. దీంతో ఏ సెట్‌ను ఏ యూనివర్సిటీకి అప్పగించాలి, ఎవరిని సెట్‌ కన్వీనర్‌గా నియమించాలో కసరత్తు మొదలైంది. జనవరి మొదటి వారంలో విశ్వవిద్యాలయాల వీసీలకు లేఖ రాయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ప్రతి వర్సిటీలోనూ కమిటీ ఏర్పాటు చేసి ఆ వర్సిటీకి కేటాయించిన సెట్‌ నిర్వహణకు కన్వీనర్‌ను ఎంపిక చేస్తారు.  

ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి 
ఉన్నత విద్యా మండలి ప్రధానంగా ఎంసెట్‌పై దృష్టి పెడుతోంది. పరీక్ష సకాలంలో నిర్వహించినా కౌన్సెలింగ్‌ విషయంలో జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌ పరీక్షలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. జేఈఈ సీట్ల కేటాయింపు పూర్తయ్యాక ఈ ఏడాది ఎంసెట్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీంతో సీట్లు పెద్దగా మిగిలిపోకుండా కాపాడగలిగారు. వచ్చే ఏడాదీ ఇదే తరహాలో సెట్‌ నిర్వహణపై కసరత్తు ప్రారంభించారు. అలాగే డిమాండ్‌ లేని కోర్సులు, విద్యార్థులు చేరని కాలేజీల జాబితాను సిద్ధం చేస్తున్నారు. వీటిని పరిగణనలోనికి తీసుకున్నాకే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఉన్నత విద్యా వర్గాలు ఆలోచిస్తున్నాయి. 

అనుకున్న సమయానికే పరీక్షలు 
వీలైనంత వరకు అనుకున్న సమయానికే వచ్చే ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. త్వరలోనే వీసీలకు అధికారికంగా లేఖలు రాస్తాం. జవాబు వచ్చాక ఏ వర్సిటీకి ఏ సెట్‌ నిర్వహణ ఇవ్వాలో నిర్ణయిస్తాం. ఈ ప్రక్రియ జనవరిలోనే పూర్తి చేసి షెడ్యూల్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం.  
– ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్‌) 

మరిన్ని వార్తలు