పోటాపోటీగా ‘పల్లె ప్రగతి’!

8 Aug, 2021 03:12 IST|Sakshi
భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి బాబుక్యాంపు గ్రామంలోని పల్లె ప్రకృతి వనం

ఉత్తమ అవార్డు కోసం ఉత్సాహంగా పనులు

మూడో విడత ప్రగతిపై ఆరు అంశాలతో జిల్లాల వారీగా నివేదిక 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అభివృద్ధి అంశంలో పల్లెల మధ్య పోటీ నెలకొంది. కొత్తగా పనుల గుర్తింపు, అసంపూర్తిగా ఉన్న పనుల పూర్తి, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లతో తమ గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేందుకు పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గాలే కాకుండా ప్రజలు పోటీ పడుతున్నారు. అధికారులు సైతం పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌.. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని సంబంధిత అధికారులు, ఉద్యోగులను హెచ్చరించిన విషయం తెలిసిందే.

మరోవైపు పల్లె ప్రగతిలో చేపడుతున్న పనుల పురోగతి, పారిశుద్ధ్యం, పంచాయతీ కార్యాలయాల తనిఖీలు, గ్రామసభల నిర్వహణ, విద్యుత్‌ బిల్లుల వసూళ్లపై క్షేత్రస్థాయి నుంచి ప్రగతి నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం ఉత్తమ, చెత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను గుర్తించి సంబంధిత అధికారులకు నివేదిస్తోంది. మూడో విడత పల్లె ప్రగతిలో పనుల పురోగతిని సమీక్షించిన ప్రభుత్వం పారిశుద్ధ్యం, పచ్చదనం–పల్లె ప్రకృతి వనాలు, పన్ను వసూళ్లు, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల అంశాలపై ఉత్తమ జిల్లాల జాబితాను గత నెలలో వెల్లడించింది. ఇదే సమయాన పెద్దగా పురోగతి లేని ఐదు జిల్లాల వివరాలను ప్రకటించారు. దీంతో నాలుగో విడతలోనూ ‘ఉత్తమ’ జాబితాలో స్థానం పొందేలా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పోటీ పడుతున్నారు. మరోవైపు చేపడుతున్న పనులతో పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయి. 

ప్రతిష్టాత్మకంగా నాలుగో విడత.
రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జూలై ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించిన అధికారులు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనులను గుర్తించి వాటిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని విడతల్లో కలిపి 51,076 గ్రామ సభలు జరిగాయి. కాగా, మూడో విడతలో జరిగిన పనులను ఆరు అంశాల్లో పరిశీలించిన ప్రభుత్వం... ఉత్తమమైన, పనుల్లో పురోగతిలో లేని ఐదేసి చొప్పున జిల్లాలను ఎంపిక చేసి వెల్లడించింది. 

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఏళ్లుగా తీరని ప్రధాన సమస్యలు పల్లె ప్రగతితో పరిష్కారమవుతూ గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పల్లె ప్రగతిలో భద్రాద్రి జిల్లా నాలుగు విభాగాల్లో రాష్ట్రంలోనే టాప్‌ ఐదు స్థానాల్లో నిలిచింది.
– రమాకాంత్, డీపీఓ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు