అనుమతిలేని ప్రాజెక్టులకు ఏపీ టెండర్లు

30 Oct, 2022 01:43 IST|Sakshi

వాటిని తక్షణమే నిలుపుదల చేయించండి

కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ టెండర్లను ఆహ్వానించిందని, తక్షణమే వాటిని నిలుపుదల చేయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కృష్ణా జలాలను బేసిన్‌ వెలుపలి ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు చేపట్టిన ఈ పనులు బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డుకు విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.

గండికోట రిజర్వాయర్‌ నుంచి నీటిని మంగపట్నం, గంగదేవిపల్లి చెరువులకు తరలించడానికి లిఫ్ట్‌లు, పైపులైన్ల నిర్మాణం, సూళ్లూరుపేట మున్సిపాలిటీకి తాగునీటిని తరలించడానికి సత్యసాయి గంగ కాల్వ వద్ద ఓటీ స్లూయిస్‌ నిర్మాణానికి ఏపీ టెండర్లు ఆహ్వానించినట్లు ఫిర్యాదు చేసింది. అలాగే ముడిగుబ్బ వద్ద జిల్లెడుబండ రిజర్వాయర్, హంద్రీనీవా ప్రధాన కాల్వ 377.1 కి.మీ. వద్ద సరప్లస్‌ వేర్, క్రాస్‌ రెగ్యులేటర్, హంద్రీనీవా–2 ప్యాకేజీ 25 లిఫ్ట్‌ నిర్మాణ పనులకు కూడా టెండర్లు పిలిచిందని ఫిర్యాదులో పేర్కొంది.

గాలేరు నగరి (జీఎన్‌ఎస్‌ఎస్‌) పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను పెన్నానదిపై ఉన్న గండికోట జలాశయానికి తరలించడం బచావత్‌ అవార్డు ఉల్లంఘన అవుతుందని వివరించింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జీఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను బేసిన్‌ వెలుపలి ప్రాజెక్టులకు తరలించడాన్ని కృష్ణా ట్రిబ్యునల్‌–2 ఎదుట తాము వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ పనులను తక్షణమే నిలుపుదల చేయించాలని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది.  

మరిన్ని వార్తలు