టిఫిన్‌కి జానారెడ్డి ఇంటికి.. లంచ్‌కి కోమటిరెడ్డి ఇంటికి..

10 Jul, 2022 00:34 IST|Sakshi

డిన్నర్‌ జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో

ఐక్యమత్యానికి కాంగ్రెస్‌ పార్టీ నేతల పాట్లు 

ఇన్‌చార్జి ఉన్నంత వరకే కలరింగ్‌.. వెళ్లిపోగానే యథాతథంగా నేతల వైఖరి 

అయోమయంలో పార్టీ కేడర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతల తీరు కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. నాయకుల కీచులాటలు, పరస్పర విమర్శలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఎప్పుడు.. ఏ నేత.. ఎవరిపై ఎలా మాట్లాడతాడో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొంది. అప్పుడే బాగున్నట్టు కనిపిస్తారు.. అంతలోనే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తుంటారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఏకంగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌కు వచ్చి గాంధీభవన్‌లో చేసిన సూచనలను సైతం గాలికొదిలేశారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నేతలందరినీ ఐకమత్యంగా ఉంచి ఒక గాడిలో పెట్టేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ముఖ్యనేతలు ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. 

టిఫిన్‌ అక్కడ.. లంచ్‌ ఇక్కడ.. డిన్నర్‌ మరోచోట..
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాజీ మంత్రి, సీనియర్‌ నేత జానారెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో టిఫిన్‌కి ఆహ్వానించారు. అయితే ఇది ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమమా? లేక పార్టీ అంతర్గత నిర్ణయం ప్రకారం జరుగుతోందా.. అన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు.

నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నమే ఇది అని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇకపోతే లంచ్‌ ఏర్పాట్లు భువనగిరి ఎంపీ, పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో జరుగుతున్నాయి. మాణిక్యం ఠాగూర్‌తో పాటు ముఖ్య నేతలందరూ మధ్యాహ్న భోజనానికి అక్కడికి హాజరుకావాలన్న సమాచారం పార్టీ నుంచి వెళ్లినట్లు తెలిసింది.

కాగా, ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన లంచ్‌ కార్యక్రమం కూడా ఐకమత్యం కోసమేనన్న టాక్‌ వినిపిస్తోంది. అలాగే పార్టీ కార్యవర్గం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డిన్నర్‌ను జూబ్లీహిల్స్‌లోని క్లబ్‌లో ఏర్పాటు చేశారు. దీనికి కూడా కీలక నేతలు, సీనియర్‌ నాయకులంతా హాజరవుతారు. 

కలరింగ్‌.. కవరింగ్‌..
అధిష్టానం నియమించిన ఇన్‌చార్జీల దగ్గరగానీ, వారు పాల్గొనే సమావేశంలో గానీ రాష్ట్ర నేతల కలరింగ్, కవరింగ్‌ ఒక స్థాయిలో ఉంటుందని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా కనిపిస్తుందని నేతలు చర్చించుకుంటున్నారు. తీరా ఇన్‌చార్జి నేతలు హైదరాబాద్‌ నుంచి విమానం ఎక్కగానే ఆ రోజు రాత్రి నుంచే కీచులాటలు, ఫిర్యాదుల పర్వం మొదలవుతుందని, ఒకరిపై ఒకరు దూషించుకోవడం చేస్తున్నారని పార్టీ అధిష్టానికి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. తాజాగా ఆదివారం జరగబోయే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌.. వ్యవహారాలు ఏ స్థాయిలో పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకువస్తాయన్నదానిపై కేడర్‌లో ఆసక్తి నెలకొంది.  

మరిన్ని వార్తలు