డీజీపీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

9 Jan, 2023 17:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ​కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన ఆధారాలను సీబీఐకి బదిలీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు.

‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆ నలుగురు ఎమ్మెల్యేలతోపాటు మిగతా వారిపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని కోరాం. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీని అపాయింట్ మెంట్ కోరితే తప్పించుకు తిరుగుతున్నారు. చీఫ్ సెక్రటరీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘ఉద్దేశపూర్వకంగా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు సీఎస్ వత్తాసు పలుకుతున్నట్లు కాంగ్రెస్ భావించాల్సి వస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల 12 నియోజకవర్గాల్లో సంక్రాంతి తరువాత కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. నాగర్ కర్నూల్‌లో దాడులకు నిరసనగా ఈ నెల 17న దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తాం. ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాలపై స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తాం’’ అని ఆయన అన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనపై కూడా డీజీపీకి ఫిర్యాదు చేశాం. ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై దూషణలు, దాడులకు దిగారు. గొంతుపై కాలు పెట్టి తొక్కి పరుష పదజాలంతో దూషించారు. ఇది ప్రభుత్వం, పోలీసుల బరితెగింపు చర్య అని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.
చదవండి: కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ కేసులో మల్లు రవికి నోటీసులు

మరిన్ని వార్తలు