చలో ‘భారత్‌ జోడో’ సభ

30 Jan, 2023 01:43 IST|Sakshi
శ్రీనగర్‌కు చేరుకున్న భారత్‌ జోడో యాత్రలో సీతక్క, రేవంత్‌ తదితరులు 

రాహుల్‌ యాత్ర ముగింపు కార్యక్రమానికి రాష్ట్రకాంగ్రెస్‌ నేతలు 

శ్రీనగర్‌ చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి 

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది సెప్టెంబర్‌ 7న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు తరలివెళ్లారు. సోమవారం జరిగే ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం అందడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే శ్రీనగర్‌కు చేరుకున్నారు.

ఆదివారమే రేవంత్‌రెడ్డి శ్రీనగర్‌లో రాహుల్‌గాంధీని కలిశారు. వీరితోపాటు నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు శ్రీనగర్‌కు వెళ్లారు. భారత్‌ జోడోయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శులకు కూడా ఆహ్వానం అందింది. దీంతో ఈ నాయకులందరూ శ్రీనగర్‌ బాట పట్టారు.  

నేడు సంఘీభావంగా సర్వమత ప్రార్థనలు 
మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. భారత్‌ జోడోయాత్ర ముగింపు, గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనామందిరాల్లో ప్రత్యేక పూజలు చేయాలని ఇటీవల జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు.

జనవరి 26న హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలను లాంఛనంగా ప్రారంభించగా, 30న అన్ని మతాల ప్రార్థనలు చేసి, ఫిబ్రవరి 6 నుంచి అట్టహాసంగా హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలను ప్రారంభించి రెండు నెలలపాటు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించనున్నట్టు టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు